Telangana Corona: కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుతోంది. ఇక తెలంగాణ కరోనా పరిస్థితులపై హైకోర్టులో సోమవారం సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోర్టు కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల లాగా తెలంగాణలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ 15వ స్థానంలో ఉందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై కూడా హైకోర్టు సీరియస్ అయ్యింది. కరోనా మొదటి దశలో ప్రైవేటు ఆస్పత్రుల ఛార్జీలపై ముగ్గురు ఐఏఎస్‌లతో కూడిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. కానీ రెండో దశలో కరోనా తీవ్రంగా ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల ఛార్జీలపై టాస్క్ ఫోర్స్ కమిటీ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో సిటిస్కాన్, ఇతర పరీక్షలకు ధరలు నిర్ణయించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన జీవో ఇప్పుడు సరిపోదని కోర్టు అభిప్రాయపడింది. కొత్తగా ధరలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.