Weather Forecast: తెలంగాణా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లి, ప్రాజెక్టులు సైతం నిండు కుండలా కళకళలాడుతున్నాయి. ఎగువన కురిసిన వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువన వదులుతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో రాగల మూడు రోజుల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి శుక్రవారం ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురియనున్నాయి. ఈ అల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కి మీ ఎత్తు వరకు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, అలాగే మరి కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. రాగల రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు భారీగా వీచే అవకాశం ఉందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. అయితే భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం చేయరాదని సూచించారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వరదల వల్ల ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పెద్దవాగులో 9 మంది కార్మికులు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇక ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతంకు జళకళతో పాటు హోయలు పోతూ పొంగి పొర్లుతోంది. జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా రెండు మూడు రోజుల పాటు సందర్శనకు అనుమతి నిరాకరించారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బొగతజలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులకు అనుమతి లేదని స్థానిక అటవీ శాఖ అధికారులు తెలిపారు.