
తెలంగాణ వ్యాప్తంగా వర్షం దంచికొడుతుంది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కుండపోత వాన కురుస్తుంది. హైదరాబాద్‌ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతుంది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కోఠి, అబిడ్స్, చార్మినార్, అబ్దుల్లాపూర్‌మెట్, ఉప్పల్ చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, శాలిబండలో, నల్లకుంట, విద్యానగర్, నాంపల్లి, లాలాపేట్, అల్వాల్ ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, మీర్‌పేట్, ఉప్పల్, తార్నాక, అత్తాపూర్, రాజేంద్రనగర్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. వరద నీటిలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనదారులు నరకం చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షం కురిసింది. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 12.9 సెంటిమీటర్ల వర్షం కురిసింది. పెద్ద అంబర్‌పేట్, బాలాపూర్‌లో 10 సెంటిమీటర్ల వర్షం నమోదైంది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 7.5సెం.మీ. వర్షపాతం నమోదైంది. నారాయణ జిల్లా కోస్గిలో 6.4 సెం.మీ., మహబూబ్ నగర్ జిల్లా జనంపేట్‌లో 6సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెప్పారు. వరద నీరు ఇళ్లల్లోకి చేరినా, విద్యుత్ సరఫరాలో అంతరాయం సహా ఏమైన సమస్యలు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..