Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దంచి కొడుతున్న వానకు..తోడు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులైన అమీర్‌పేట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, బాలానగర్, కూకట్‌పల్లి , నిజాంపేట ఏరియాలో రహదారులపై మోకాల్లోతు నీరు నిలిచిపోయింది.
ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో జంటనగరాల్లో మధ్యాహ్నం రెండు గంటల వరకే 5 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జనం అష్టకష్టాలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో మోకాల్లోతు నీటిలో జనం ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ కి వెళ్లిన విద్యార్థులు, అవసరాల కోసం బయటికి వచ్చిన జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ వర్షం కారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు, ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. వర్షం తగ్గిన వెంటనే తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు బయటకు రావొద్దని, వర్షం తగ్గిన గంట తరువాత రోడ్లపైకి రావాలని సూచించారు. వర్షం పడిన తరువాత రహదారులపై భారీగా నీరు చేరుతుందని, దీని వల్ల వాహనదారులు మ్యాన్ హోల్స్ గుర్తించలేక ప్రమాదాలు పడే అవకాశం ఉందని సూచించారు.
ఇదిలాఉంటే తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు అంచనా వేశారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి