Crop Loan Waiver: మళ్లీ రుణమాఫీ రగడ.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ కౌంటర్‌..

|

Sep 08, 2024 | 9:15 PM

రుణమాఫీపై మరోసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ రగడ మొదలైంది. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తుంటే.. రుణమాఫీ కోసం గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే తాము అనుసరిస్తున్నామని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.

Crop Loan Waiver: మళ్లీ రుణమాఫీ రగడ.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ కౌంటర్‌..
Telangana Politics
Follow us on

తెలంగాణలో రుణమాఫీపై మరోసారి రాజకీయ రగడ మొదలైంది. రైతు రుణమాఫీ అంశంగా విపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసింది. కాంగ్రెస్‌ పాలన రైతులకు శాపంగా మారిందని విమర్శించారు మాజీమంత్రి హరీష్‌రావు. సీఎం రేవంత్‌రెడ్డి పూటకో మాట మాట్లాడుతూ రైతులను మోసం చేశారని మండిపడ్డారు. రుణమాఫీ కాలేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. 9 నెలల్లో దాదాపు 475 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 20 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యిందని.. మరో 21 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని వెల్లడించారు. మిగతా రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ పేరుతో అనేక మందికి పదవులు ఇస్తున్నారని.. వ్యవసాయ కమిషన్ రైతులను కాపాడటానికా లేక వారి ప్రాణాలు తీయడానికా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాటలకు, చేతలకు పొంతనలేదని హరీష్‌రావు విమర్శించారు.

అయితే హరీష్‌రావుకు కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. రైతులు సంతోషంగా ఉన్నారని హరీష్‌రావు బాధపడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రుణమాఫీపై సీఎం రేవంత్‌ మాట నిలబెట్టుకున్నారని.. హరీష్‌రావు ఓర్వలేక మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే తమ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. తాము కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టలేదన్నారు. మొత్తం 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని ఆది శ్రీనివాస్ అన్నారు. రైతులను రెచ్చగొట్టే హరీష్‌రావు ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు.

త్వరలోనే కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్న నేపథ్యంలో… రుణమాఫీ అంశంపైనే సర్కార్‌ను గులాబీ నేతలు లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..