పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధం.. పోలింగ్ కోసం 1,685 జంబో బ్యాలెట్‌ బాక్సుల రెడీ..

|

Mar 13, 2021 | 9:08 AM

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధం.. పోలింగ్ కోసం 1,685 జంబో బ్యాలెట్‌ బాక్సుల రెడీ..
Graduate mlc Elections 2021
Follow us on

Graduate MLC elections 2021 : తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై అదనపు డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్‌ అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ సమీక్షిస్తున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో 164 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఈసారి 1,685 జంబో బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేసినట్లు చెప్పారు.

రేపు ఉదయం నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో.. భారీ స్థాయిలో పోలింగ్‌ జరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంతోపాటు.. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానానికి భారీస్థాయిలో పోటీ జరుగుతోంది. అయితే, అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. పేరుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే అయినప్పటికీ అభ్యర్థుల ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించింది.

మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్‌ నిర్వహణలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఫేక్‌ ఓట్లు ఇప్పుడు సమస్యగా మారాయి. వాటిని అధిగమించేందుకు అధికారులు చేస్తున్న కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు, వారికి మద్దతి స్తున్న పార్టీల నేతలు, కార్యకర్తలు, అనుయాయులు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు శక్తియుక్తులు ధార పోస్తున్నారు. ఇతరత్రా ప్రాంతాల్లో ఉన్నవారికి వెతికిపట్టి మరీ ఓటు వేయాలని వేడుకుంటున్నారు.

వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్ట భద్రుల నియోజకవర్గంలో 2015లో జరిగిన ఎన్నికల్లో 22 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఈ సారి 71 మంది పోటీలో ఉన్నారు. ఈసారి అభ్యర్థులతోపాటు ఓటర్ల సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,81,138 ఓట్లు ఉండగా 1,53,547ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ఆ ఓటర్ల సంఖ్య అమాంతం పెరిగింది. ఏకంగా 5,05,565 మంది ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఉమ్మడి మూడు జిల్లాలకు కలిపి 12 జిల్లాలో మొత్తం 5,05,565 మంది ఓటర్లు ఉండగా 731 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి 805 జంబో బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. నల్లగొండ మార్కెటింగ్‌శాఖ గిడ్డంగిలో 8 హాళ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపునకు 56 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈసారి పోలింగ్‌శాతం పెంచుకోగలిగితే తప్ప గట్టెక్కలేమన్న అంచనాల్లో అభ్యర్థులున్నట్లు సమాచారం.

ఇక, హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 5లక్షల 36వేల 268 ఓటర్లున్నారు. మొత్తం 799 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి రెండు బాక్సుల చొప్పున 15వందల బ్యాలెట్‌ బాక్స్‌లను సిద్ధం చేశారు. ఇప్పటికే సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరించారు. ఎన్నికల కోసం మొత్తం 3వేల 835 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వారిలో 959 మంది పీఓలు ఉండగా.. 2వేల 876మంది ఓపీఓలు ఉన్నారు.

ఇక, పోలింగ్‌ రోజు అభ్యర్థికి 2 వాహనాలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. ప్రతి జిల్లాకు అదనంగా మరో వాహనానికి అనుమతిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్‌ సమయంలో కొవిడ్‌ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో వీడియోగ్రఫీ కూడా చేయిస్తున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండిః ఎన్నికల ఇంచార్జ్‌లతో మంత్రి హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్‌.. ఆ విషయంలో మంత్రి కీలక సూచనలు