
మద్యం దుకాణం లక్కీడ్రాలో అదృష్టం వరించిందనుకుంటే.. అంతలోనే దురదృష్టం ఉద్యోగం నుంచి సస్పెన్షన్‌లా తగులుకుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన ఇప్పుడు ఆసక్తిగా మారింది. జిల్లా కేంద్రంలోని రాంనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పుష్ప అనే యువతి పీఈటీగా పనిచేస్తున్నారు. ఇటీవల తెలంగాణ మద్యం దుకాణాల టెండర్ల లక్కీడ్రాలో ఆమె దరఖాస్తు చేసుకున్నారు. రూ.3లక్షల రుసుము చెల్లించి ధర్మాపూర్ వైన్స్ షాప్‌నకు అప్లికేషన్ పెట్టుకుంది. అక్టోబర్ 26వ తేదీన జిల్లా కలెక్టర్ విజయేందిరా బోయి ఆధ్వర్యంలో తీసిన లక్కిడ్రాలో పీఈటీ పుష్పకు టెండర్ దక్కింది. అనంతరం వైన్స్ టెండర్ ఖరారు పత్రాలపై అధికారుల సమక్షంలో సంతకాలు సైతం చేసింది. వేలమందిలో అదృష్టం వరించిందని ఆమెతో పాటు కుటుంబం మురిసిపోయింది.
సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆమెకు వరించిన అదృష్టం వివాదాస్పదం అయ్యింది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ టెండర్లలో పాల్గొనకూడదు. దీంతో కొంతమంది వ్యాపారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే మరికొంత మంది విద్యాశాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు సైతం చేశారు. ఇక ఈ వ్యవహారంపై విచారణ చేసిన అధికారులకు షాకింగ్ నిజాలు తెలిసాయి.
పీఈటీ పుష్ప లీవ్ పెట్టి మరీ టెండర్లలో పాల్గొన్నట్లు తేలింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఇలాంటి అంశంలో ఇన్వాల్వ్ కావడాన్ని ఉన్నాతాధికారులకు వివరించారు. అయితే రాజకీయ ఒత్తిడి కారణంగా ఆమె అంశంలో చర్యలు తీసుకునేందుకు ఆలస్యం చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. స్థానికంగా, సోషల్ మీడియాలో ఉపాధ్యాయురాలు.. మద్యం వ్యాపారం’ అంటూ తెగ వైరల్ అయ్యింది.
దీంతో చేసేదీ లేక పీఈటీ పుష్పపై ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నిబంధలనకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్వహించిన టెండర్ లో పాల్గొన్నందుకు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. పూర్తిస్థాయి క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమారు ఉత్తర్వులు జారీ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..