
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ (TGRSCL) ఆధ్వర్యంలో తొర్రూర్, బహదూర్‌పల్లి, కుర్మల్ గూడా ప్రాంతాల్లోని ప్రభుత్వ ఓపెన్ ప్లాట్లను వేలం వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 137 ప్లాట్లకు ఫిబ్రవరి 7, 8 తేదీల్లో వేలం జరగనుంది. తొర్రూర్‌లోని ప్లాట్లకు రెండు రోజుల పాటు వేలం నిర్వహించనుండగా, బహదూర్‌పల్లి, కుర్మల్ గూడాలోని ప్లాట్లు ఫిబ్రవరి 8న మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రాంతాల వారీగా చూస్తే.. తొర్రూర్‌లో 200 నుంచి 500 చదరపు గజాల వరకు ప్లాట్లు ఉన్నాయి. బహదూర్‌పల్లిలో 200 నుంచి 1,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయి. కుర్మల్ గూడలో 200 నుంచి 300 చదరపు గజాల వరకు త్వరలో ప్లాట్లను వేలం వేయనున్నారు. వేలంలో పాల్గొనాలంటే రూ.2 లక్షల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) తప్పనిసరిగా చెల్లించాలి. అయితే తొర్రూర్, బహదూర్‌పల్లి, కుర్మల్ గూడలోని మూడు ప్రాంతాల ప్లాట్లకూ ఒకే విధంగా వర్తిస్తుంది. వేలం అనంతరం కొనుగోలు జరగని వారికి ఈ డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు. TGRSCL అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ ఓపెన్ ప్లాట్లు పూర్తిగా వివాదరహితమైనవిగా, స్పష్టమైన హక్కులతో ప్రభుత్వ సంస్థ పేరిట ఉన్నాయి.
తొర్రూర్ ఔటర్ రింగ్ రోడ్, ఆదిభట్ల ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండగా, బహదూర్‌పల్లి ORRకు ఆనుకుని ఉంది. కుర్మల్ గూడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆర్‌సీఐ, ORRకు దగ్గరగా ఉంది. వేలంలో పాల్గొనాలనుకునే వారు మీ సేవ కేంద్రాల ద్వారా లేదా హైదరాబాద్‌లో చెల్లుబాటు అయ్యేలా ‘మ్యానేజింగ్ డైరెక్టర్, TGRSCL’ పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా EMD చెల్లించవచ్చు. మీ సేవ రసీదు లేదా డీడీని వేలం రోజున హాజరు సమయంలో చూపించాల్సి ఉంటుంది. వేలం ప్రక్రియ ORR ఎగ్జిట్ నంబర్ 11 వద్ద, అంబర్‌పేటలో ఉన్న అవికా కన్వెన్షన్, తారా కన్వెన్షన్ పక్కన నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం TGRSCL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.