
హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. తెలంగాణ సాంస్కృతిక సారథిలోని ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ఓ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌ఎస్ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థిక శాఖ 3 నెలల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. దీనికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. పీఆర్సీ 2020 ప్రకారం టీఎస్‌ఎస్ ఉద్యోగులకు వేతనాలు పెరుగుతున్నాయి.
తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పీఆర్సీ 2021 జూన్ 1వ తేదీ నుంచి పీఆర్సీ వర్తిస్తుందని సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ తెలిపింది. ఇదిలావుంటే.. పీఆర్సీ అమలుకు కావాల్సిన చర్యలను వెంటనే తీసుకోవాలని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌కు తెలంగణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ విభాగంలో మొత్తం 583 మంది కళాకారులతో తెలంగాణ సాంస్కృతిక సారథిని 2014 సెప్టెంబర్ 30న ఏర్పాటు చేసింది. రాష్ట్రం ఏర్పండిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యోమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ఉద్యోగాలకు కల్పించింది. ఇందులో మొత్తం 550 మంది కళాకారులు ఉద్యోగాలు దక్కించుకున్నారు. వీరిలో 319 మంది ఎస్సీలు, 38 మంది ఎస్టీలున్నారు. ఇందులో పనిచేస్తున్న కళాకళాకారులకు ప్రభుత్వం నిధి నుంచి జీతాలను అందిస్తోంది.
ప్రస్తుతం పే స్కేలు మీద 30 శాతం పీఆర్సీని అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉద్యోగుల పేస్కేలు24,514 ఉండగా.. నూతన పీఆర్సీ ప్రకారం జీతభత్యాలు ఒక్కొక్కరికీ రూ. 7,300 మేర పెరగనుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సాంస్కృతిక సారథిలోని ఉద్యోగులు కళాకారులు కళాబృందాలుగా ఏర్పడి సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటారు. అంతేకాకుండా కళా ప్రదర్శనలకు శిక్షణ అందించడం.. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహించే పని కూడా వీరు చేస్తుంటారు.
వీరి ప్రచారంలో భాగంగా పాటలు, నృత్యాలతో ప్రభుత్వం చేపట్టే వివిధ పథకాలను ప్రమోట్ చేస్తుంటారు. ఇందు కోసం ప్రజాహిత కార్యక్రమాలను గ్రామంలోని చిట్టచివరి వ్యక్తికి తీసుకువెళ్లే పనిలో ఉంటారు. కళా ప్రదర్శనలకు అనువైన శిక్షణనివ్వడానికి, వర్క్ షాపులు నిర్వహించడానికి సాంస్కృతిక సారథి సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్నది.
అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయసును పెంచుతూ ప్రభుత్వం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం తెలిసిందే. వారి రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లు నుంచి 65 ఏళ్లకు పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి