
రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. బదిలీల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీఓ 38 నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) ఆందోళన బాట పట్టింది. రాష్ట్రంలోని సుమారు 5 వేల మంది వైద్యులు ఈ ఉద్యమంలో పాల్గొననున్నట్లు సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమేశ్ తెలిపారు. ఆందోళనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ (ఔట్ పేషెంట్) సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిలూఫర్ తదితర ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఓపీ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే అత్యవసర సేవలు, ఇన్‌పేషెంట్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని వైద్యుల సంఘం స్పష్టం చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన జీఓ 38ను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని టీజీజీడీఏ పేర్కొంది. బదిలీల ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. వివిధ వైద్య సంఘాల ప్రతినిధులు కూడా ప్రభుత్వాన్ని జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇక జీఓ 38 నిబంధనలు పూర్తిగా అమలయ్యే వరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్లో ఎవరూ బదిలీ ఆప్షన్ ఫారాలు సమర్పించబోరని సంఘం కేంద్ర కార్యవర్గం ప్రకటించింది.
2026 ఏప్రిల్‌లో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 38 ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది. బదిలీలను పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు ఈ ఉత్తర్వులు తీసుకొచ్చారు. రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు తావులేకుండా నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా బదిలీలు చేపట్టాలన్నదే దీని ఉద్దేశం. ఈ జీఓలో సీనియారిటీ, తప్పనిసరి బదిలీ ప్రమాణాలు, భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో పనిచేసేలా ‘స్పౌస్ క్రైటీరియా’ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే నగర ప్రాంత పోస్టింగ్‌లు (ఫోకల్), గ్రామీణ/దూర ప్రాంత పోస్టింగ్‌లు (నాన్-ఫోకల్) మధ్య సమతుల్యతను కాపాడేందుకు ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. వైద్యుల బంద్ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…