సూపర్ గుడ్ న్యూస్.. ఇకపై అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్..

తెలంగాణలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో వచ్చే నెల నుంచి చిన్నారులకు అల్పాహారం అందించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ప్రస్తుతం రెండు జిల్లాల్లో విజయవంతంగా అమలవుతున్న పైలట్ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారుల పోషకాహారం, ఆరోగ్యం, హాజరు శాతాన్ని మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.

సూపర్ గుడ్ న్యూస్.. ఇకపై అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్..
Telangana Anganwadi

Edited By:

Updated on: Jul 16, 2026 | 7:29 AM

అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పై మరో కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే.. అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అల్పాహారం అందించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల నుంచి అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని అమలు చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ పథకం మంచి ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు. ఈ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు. సచివాలయం నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. బలమైన సమాజ నిర్మాణానికి బాల్య దశ ఎంతో కీలకమని అన్నారు. చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, ప్రాథమిక విద్యను అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అంగన్వాడీలను పిల్లల అభివృద్ధికి బలమైన వేదికగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

చిన్నారుల హాజరు శాతాన్ని పెంచేందుకు ‘అమ్మ మాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గ్రామంలో తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి చిన్నారిని అంగన్వాడీ సేవలకు అనుసంధానం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే మంజూరైన 2,500 కొత్త అంగన్వాడీ భవనాల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని మంత్రి పేర్కొన్నారు. నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తిచేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహార నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండబోదని మంత్రి స్పష్టం చేశారు. గుడ్లు, పాలు, ఇతర పోషకాహార పదార్థాల సరఫరాలో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లను వెంటనే బ్లాక్‌లిస్టులో చేర్చుతామని హెచ్చరించారు. జిల్లా అధికారులు, సూపర్వైజర్లు తరచూ కేంద్రాలను సందర్శించి పర్యవేక్షణ చేపట్టాలని, అవసరమైతే స్వయంగా అక్కడ భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించాలని సూచించారు.

తెలంగాణను బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి సీతక్క తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్లు గుర్తిస్తే సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us