
సూర్యాపేటకు చెందిన బిక్కుమల్ల సంతోష్ బాబుకు చిన్నతనం నుంచే దేశభక్తి మెండు. తండ్రి కోరిక నెరవేర్చడం కోసం ఆర్మీలో చేరాడు. అనతి కాలంలో సంతోష్ ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. భారత్-చైనా సరిహద్దుల్లో 2020 జూన్ లో ఘర్షణలు జరిగాయి. గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన భీకర ఘర్షణలో దేశ రక్షణ కోసం కల్నల్ సంతోష్ బాబు తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి వీరమరణం పొందారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్ 1 ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చింది. ఆయన ధైర్యసాహసాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2021లో దేశంలోనే రెండో అత్యున్నత సైనిక పురస్కారమైన మహావీర్ చక్ర’తో సంతోష్ బాబును గౌరవించింది.
ఇపుడు ఆ యుద్ధ వీరుడు కల్నల్ బికుమళ్ళ సంతోష్ బాబు కుటుంబం ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టింది. కుమారుడిని దేశానికి అంకితం చేసిన మాతృమూర్తిగా సంతోష్ బాబు తల్లి మంజుల మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగింది. సూర్యాపేట మున్సిపాలిటీలో 44వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బికుమళ్ళ మంజుల ఉపేందర్ బిఆర్ఎస్ పార్టీ తరపున తన నామినేషన్‌ను అత్యంత ఉత్సాహంగా దాఖలు చేశారు. తన కుమారుడు దేశ ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడి ప్రాణత్యాగం చేయగా, తాను స్థానిక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచింది.
Santosh Babu’s Mother Manjula
‘‘నా కుమారుడు దేశం కోసం అసువులు బాశాడని, ఒక తల్లిగా నేను నా ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం పని చేయాలనుకుంటున్నా’’.. అంటూ మంజుల చెప్పారు. బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రజల ఆశీర్వాదంతో కౌన్సిలర్ గా గెలిచి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంజుల ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. నిస్వార్థ సేవకు మారుపేరుగా నిలిచిన సంతోష్ బాబు వారసత్వాన్ని రాజకీయాల్లోనూ కొనసాగిస్తానని ఆమె హామీ ఇచ్చారు.
ఒక వీర జవాన్ తల్లి ఎన్నికల్లో పోటీ చేయడంతో సూర్యాపేట పట్టణంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆమె అభ్యర్థిత్వానికి స్థానిక ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఈ వీరమాతకు పట్టం కట్టి.. గౌరవిస్తారో లేదో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..