Hyderabad: అపార్ట్‌మెంట్‌లో అద్భుతం.. ఒకప్పుడు ట్యాంకర్ల కోసం లక్షలు పోశారు.. కట్‌చేస్తే.. ఈసారి నీళ్లే నీళ్లు
సమ్మర్ వచ్చిందంటే చాలూ మణికొండ లాంటి ఏరియాల్లో వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకోందే రోజు గడవదు. కానీ ఇక్కడో అపార్ట్‌మెంట్ వాసులు మాత్రం.. గడిచిన రెండున్నర నెలల్లో ఒక్కటంటే ఒక్క ట్యాంకర్‌ను కూడా బుక్ చేసుకోలేదు. పైగా గతేడాది ట్యాంకర్ల కోసమే రూ.90వేలు ఖర్చుపెట్టిన ఈ అపార్ట్‌మెంట్ ప్రజలు ఈ సారి మాత్రం పైసా కూడా పెట్టలేదు. మరీ వీళ్లను నీరు ఎలా వచ్చాయనేగా మీ డౌట్ అయితే ఇది తెలుసుకోవాల్సిందే.

వేసవి వచ్చిందంటే చాలు నగరవాసులకు నీటి ట్యాంకర్ల వేట మొదలవుతుంది. వేలాది రూపాయలు కుమ్మరించినా చుక్క నీరు దొరకని పరిస్థితి. సరిగ్గా గత ఏడాది మణికొండ రోడ్ నంబర్ 26లోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లోని ‘అనూహర్ పర్పుల్ ట్యూన్స్‘ అపార్ట్‌మెంట్ వాసులు కూడా ఇలాంటి గడ్డు కాల్యాన్నే ఎదుర్కొన్నారు. కేవలం ట్యాంకర్ల కోసమే ఏకంగా రూ.90 వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయితే, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకున్న ఆ అపార్ట్‌మెంట్ నివాసితులు.. కేవలం చేతులు ముడుచుకుని కూర్చోకుండా జల సంరక్షణకు నడుం బిగించారు.
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మార్గదర్శకత్వంలో చేపట్టిన ‘ఇంటింటి ఇంకుడు గుంత’ ప్రయోగం ఇప్పుడు అద్భుత ఫలితాలను ఇస్తూ నగరంలోని మిగతా సొసైటీలకు ఆదర్శంగా నిలిచింది. గత ఏడాది ఎదురైన నీటి ఎద్దడిని గుణపాఠంగా తీసుకున్న అపార్ట్‌మెంట్ వాసులు శాశ్వత జల భద్రత వైపు అడుగులు వేశారు. జలమండలి వాటర్ హార్వెస్టింగ్ ఓఎస్‌డీ సత్యనారాయణ సంప్రదించి వారి సాంకేతిక సలహాలతో అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోని బోర్‌వెల్ సమీపంలో ఒక శాస్త్రీయమైన వర్షపు నీటి నిల్వ గుంతను నిర్మించారు. అపార్ట్‌మెంట్ టెర్రస్ పై పడే ప్రతి వర్షపు చుక్క వథా కాకుండా, అన్ని పైపులను కేంద్రీకత వ్యవస్థ ద్వారా అనుసంధానించి నేరుగా ఈ ఇంకుడు గుంతలోకి మళ్లించారు. దీనివల్ల వర్షపు నీరంతా భూమిలోకి ఇంకి, భూగర్భ జల మట్టం పెరగడానికి బలమైన పునాది పడింది.
పెరిగిన బోరు బావుల జలకళ
కొద్ది నెలలకే వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ వినూత్న ప్రయత్నానికి తొలి ఫలితం దక్కింది. కురిసిన ప్రతి వర్షపు నీరు ఇంకుడు గుంత ద్వారా భూగర్భంలోకి చేరి, అడుగంటిన బోర్‌వెల్‌ను రీఛార్జ్ చేయడం ప్రారంభించింది. అంతకుముందు ఎండిపోయే స్థితికి చేరిన బోర్లలో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వచ్చింది. సమిష్టి కృషితో ప్రకృతి ప్రసాదించిన వాన నీటిని ఒడిసిపట్టడం వల్ల భూగర్భ జలాలు ఎంత వేగంగా పునరుజ్జీవం పొందుతాయో ఈ ప్రయోగం కళ్లకు కట్టినట్లు నిరూపించింది.
ఆర్వో వృథా నీటితో నిరంతర జల పోషణ
తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో అపార్ట్‌మెంట్ వాసులు మరో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా ప్రతి ఫ్లాట్‌లో వాడే వాటర్ ప్యూరిఫైర్ల నుండి సగానికి పైగా నీరు వృథాగా బయటకు పోతుంటుంది. ఈ ఏడాది ఆ వృథా నీటిని డ్రైనేజీ పాలు చేయకుండా, అపార్ట్‌మెంట్‌లోని అన్ని ఫ్లాట్ల ఆర్‌ఓ అవుట్‌లెట్ పైపులను ఒకే లైనుకు అనుసంధానించి ఇంకుడు గుంతకు కనెక్ట్ చేశారు. దీనివల్ల ఇళ్లలో శుద్ధి ప్రక్రియ జరిగినంత సేపూ ఆ వృథా నీరు నిరంతరాయంగా భూమిలోకి ఇంకుతూ 24 గంటలూ భూగర్భ జలాల రీఛార్జ్ ప్రక్రియకు ఊతాన్ని ఇస్తోంది.
రెండున్నర నెలలుగా ’జీరో’ ట్యాంకర్స్
ఈ రెండు వినూత్న ప్రయోగాల కలయికతో అపార్ట్‌మెంట్ జలవనరుల రూపురేఖలే మారిపోయాయి. వర్షపు నీరు, ఆర్‌ఓ వ్యర్థ జలాల నిరంతర రీఛార్జ్ కారణంగా ఎండిపోయే దశకు చేరిన అపార్ట్‌మెంట్ బోరుబావి మళ్లీ జలకళను సంతరించుకుంది. దీని ఫలితంగా, గత రెండున్నర నెలలుగా ఈ అపార్ట్‌మెంట్ వాసులు ఒక్క నీటి ట్యాంకర్ కూడా బుక్ చేయాల్సిన అవసరం రాలేదు. ప్రతి నెలా అయ్యే వేల రూపాయల మెయింటెనెన్స్ ఖర్చు మిగలడమే కాకుండా, అపార్ట్‌మెంట్ కమ్యూనిటీకి దీర్ఘకాలిక జల భద్రత లభించింది. పర్యావరణహితమైన ఈ విధానం ద్వారా అటు అపార్ట్‌మెంట్ నివాసితులకు ఆర్థిక ఊరట, ఇటు భూమాతకు జల సంరక్షణ చేకూరాయి. చిన్నపాటి సమాజ భాగస్వామ్యం, సరైన ప్రణాళిక ఉంటే ఎంతటి నీటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కోవచ్చని ఈ విజయం నిరూపించింది.
మనం నీటిని కాపాడితే.. ఆ నీరు మనల్ని కాపాడుతుంది
ఈ రోజు మనం నీటిని కాపాడితే, రేపు ఆ నీరు మనల్ని కాపాడుతుంది అనే సందేశాన్ని ‘అనుహర్ పర్పుల్ ట్యూన్స్’ వాసులు బలంగా చాటుతున్నారని జలమండి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో నగరంలో భూగర్భ జలాల సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని, ప్రతి ఇల్లు, ప్రతి అపార్ట్‌మెంట్‌లో ఇలాంటి ఇంకుడు గుంతల నిర్మాణం లేకపోతే రాబోయే రోజుల్లో నీటి చుక్క కోసం అల్లాడక తప్పదని తెలిపారు. కాబట్టి పర్యావరణ హితమైన, శాశ్వత నీటి భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలను చేపట్టాలని ఆయన సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
