మనం మనం బరంపురం.. మీది తెనాలే.. మాది తెనాలే.. ఇలాంటి సెంటిమెంట్ ఎక్కడైనా పనిచేస్తుంది. సరిగ్గా ఈ వీక్‌నెస్‌పైనే కొట్టి.. ఓ మాయగాడు ఏకంగా ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించాడు. ఒక్కసారి అతని మాటలు నమ్మి ఐస్ అయిపోయినోళ్ల జేబులు ఖాళీ చేసేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను మోసం చేయడంతోపాటు దాదాపు 20 మందిని ముంచాడు ఓ కేటుగాడు.
తాను ఒక రిటైర్డు ఎంపీడీవోను అంటూ.. ఒక ఆర్గనైజేషన్ పేరుతో పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టిస్తానని ఒక ఎమ్మెల్యేను నమ్మించాడు. గ్రామంలో శంఖుస్థాపన కూడా చేయించాడు. తీరా చూస్తే తను ఒక మోసగాడు అని తెలిసి అవాక్కయ్యారు. పేదలకు ఇండ్లు కట్టిస్తానని మోసం చేసిన వ్యక్తి పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాత కుప్పెనకుంట్ల గ్రామంలోని 20 మంది పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టిస్తాను అని నమ్మించాడు. ఆంధ్రాలోని మచిలీపట్నంలో ఎంపీడీవోగా పని చేసి రిటైర్ అయ్యాను అంటూ నమ్మించాడు. అద్దంకి జనార్దన్ రావు అనే వ్యక్తి PS రావు అనే ట్రస్ట్ ద్వారా పేదలకు ఇండ్లు ఉచితంగా కట్టిస్తాను అని గ్రామస్తులను సైతం నమ్మించాడు. అంతే కాదు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయిని సైతం మాటలతో మాయ చేశాడు. పాత కుప్పెనకుంట్ల గ్రామంలో ఒక 20 ఇండ్లు కట్టేందుకు జూలై 8వ తేదీన శంఖుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాగమయిని అతిథిగా ఆహ్వానించారు. అనంతరం పేదలకు ఇండ్లు ఉచితంగా కట్టివ్వాలి అంటే ఒక్కొక్కరి నుంచి 4 వేలు నగదు వసూళ్లు చేసి ముఖం చాటేశాడు. దీంతో అనుమానం కలిగిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో అతగాడు అసలు భాగోతం బయటపడింది. మాజీ ఎంపీడీవో అని చెప్పుకుంటున్న అద్దంకి జనార్దన్ రావుపై ఆంధ్రా లో ఐదు చోట్ల చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు పెనుబల్లి పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసలు, అతగాడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…