తెలంగాణలోని సూర్యాపేట జిల్లా సూర్యాపేట-ఖమ్మం హైవేపై బుధవారం ఆటోను బస్సు ఢీకొనడంతో ఐదుగురు వ్యవసాయ కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 9 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 15 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో రిక్షాను అండర్‌పాస్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మునగాల మండలం రామసముద్రం గ్రామానికి చెందిన కూలీలు మోతె మండలం బుర్కచెర్ల గ్రామంలో పొలాల్లో పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా, గాయపడిన వారిలో ఇద్దరు మృతి చెందారు. మృతులు నాగమ్మ (50), నారాయణమ్మ (55), అనసూయమ్మ (70), సౌభాగ్యమ్మ(58), కందుల గురువయ్య(63)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు మధిర డిపోకు చెందినదిగా గుర్తించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
మృతుల కుటుంబాలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వాస్పత్రిలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాహుల్ హెగ్డే, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పరామర్శించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..