మాయం అయి పోతున్నడమ్మా.. మనిషి అన్నవాడు..! మచ్చుకు అయిన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, అనే ఈ పాట ప్రస్తుతం కాలానికి సరిగ్గా సరిపోతుంది. కొన్ని కొన్ని ఘటనలు చూస్తే, అది నిజమే అనిపిస్తుంది. కొంతమంది చేసే పనులకు మనం ఊర్లల్లో బతుకుతున్నమా..? అడవిలో బతుకతున్నామా అనే అనుమానం రాక మానదు..! ఒక మనిషి బతికి ఉన్నప్పుడే కాదు, మనిషి చనిపోయిన కూడా అతనికి విలువ ఇవ్వడం లేదు చాలా మంది. ఓ మహిళ చనిపోతే ఆమె దహన సంస్కారాలను సైతం అడ్డుకున్నారు.
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లింగంపల్లి ఎల్లమ్మ అనే వృద్ధురాలు గత మూడు రోజుల క్రితం మృతిచెందింది. మృతురాలికి దహన సంస్కారాలు నిర్వహించడానికి, వాళ్ల కుటుంబీకులు గ్రామంలోని వైకుంఠధామం వద్దకు వెళ్ళారు. అయితే ఇక్కడ వారి కులస్తులు దహన సంస్కారాలు చేయకూడదని గ్రామ మాజీ సర్పంచ్ అడ్డుకున్నారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. గ్రామానికి పెద్ద దిక్కుగా ఉండే మాజీ సర్పంచ్ ఇలా చేస్తే, చేసేదీ ఏమి లేక మృతురాలి కుటుంబీకులు గ్రామంలోని చెరువు కట్టపై ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు.
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామంలోని మంగలి కులస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కుల పెద్దలు అందరూ కలిసి తమ సమస్య పరిష్కారం అయ్యేవరకు గ్రామంలో ఎవరికి కటింగ్ చేయకూడదని తీర్మానం చేసుకున్నారు. దీంతో గ్రామంలో క్షౌర సేవలను నిలిపివేశారు. కాగా గ్రామంలో కట్టిన వైకుంఠధామం ఒక కులస్థుల కోసం కట్టినది అని, అందుకే వీరిని వైకుంఠధామంలోకి అనుమతి ఇవ్వలేదని సదరు మాజీ సర్పంచ్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. మరో ఇద్దరు గ్రామస్తులు ఇరు మధ్య సయోధ్య కుదుర్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరీ ఈ ఉదంతం ఎక్కడి వరకు దారి తీస్తుందో..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..