ఖమ్మం టు హైదరాబాద్ పొలిటికల్ ట్రాన్స్‌పర్ అడుగుతున్నారు ఓ మాజీ మంత్రి. గ్రేటర్ హైదరాబాద్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్ళు ఊరుతున్నారట. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆ నియోజకవర్గంలో జెండా పాత ఎందుకు సిద్ధమవుతున్నారు. ఆ మాజీ మంత్రి పొలిటికల్ జర్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రాజకీయాల్లో స్థానచలనం కామన్. నియోజకవర్గం రిజర్వ్ అయినప్పుడు, లేదా పునర్విభజన జరిగినప్పుడు, వారసుల కోసమో పక్క నియోజకవర్గానికి లేదా జిల్లాలోని ఇంకో స్థానం నుంచి పోటీ చేస్తారు. కానీ ఈ మాజీ మంత్రి మాత్రం ఖమ్మం నుంచి హైదరాబాద్‌లో ఉన్న శేరి లింగంపల్లి నియోజకవర్గానికి రావాలని కోరుకోవడం చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ మధ్యలోనే బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారు శేరి లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. గులాబీ పార్టీలో నియోజకవర్గం ఖాళీగా ఉంది. ఈనేపథ్యంలోనే శేరి లింగంపల్లిపై కన్నేసినట్టు తెలుస్తోంది.
మొన్న ఖమ్మంలో ఓటమిపాలైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శేరి లింగంపల్లి నియోజకవర్గంలో కర్చిఫ్ వేయడానికి సిద్ధమవుతున్నారట. ఖమ్మం కంటే శేరి లింగంపల్లి సేఫ్ అని ఆయన భావిస్తున్నారట. ఈ నియోజకవర్గం ఆయన కమ్యూనిటీకి సంబంధించిన కమ్మ ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున ఉండడం.. సెటిలర్స్ మెజారిటీ ఉన్న నియోజకవర్గం కావడం కలిసి వస్తుందని భావిస్తున్నారట. తాను సెటిలర్ కాకపోయినా, తనకు అన్ని విధాలుగా వారి నుంచి మంచి మద్దతు వస్తుందని ఆయన నమ్ముతున్నారట. దీంతోపాటు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అరికెపూడి గాంధీ పార్టీ మారడంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని పువ్వాడ భావిస్తున్నారట. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయం అనేది ఆయన ధీమాలో ఉన్నారట.
మరోవైపు ఖమ్మంలో ఓటమి పాలు కావడంతో అక్కడ కొంత ప్రతికూల పరిస్థితి పువ్వాడ అజయ్ కి ఉంది. ఖమ్మంలో గెలుపొందిన తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉండడం.. వీటన్నిటితో పాటు హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు మంచి పట్టు ఉండడం కూడా ఆయనకు కలిసొచ్చే అంశాలని అనుకుంటున్నారట. తన మనసులో మాటను ఇప్పటికే అధిష్టానం చెవిలో వేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పెద్దలు ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. పువ్వాడ ఇక్కడ పోటీ చేయడం వల్ల పార్టీకి జరిగే లాభనష్టాలను అంచనా వేసిన తర్వాతే ఏ నిర్ణయం అయినా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..