Kadam Project: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు, వరలతో ప్రాజెక్టులకు భారీగా వరదనీరు చేరుతోంది. కాగా.. నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఔట్ ఫ్లో 3 లక్షలుగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 18 గేట్లకు 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఒక గేటు మొరాయించడంతో.. దానికి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి కడెం ప్రాజెక్టుకు వరద నీరు తీవ్రంగా పోటెత్తుండటంతో.. ప్రాజెక్ట్ ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ హెచ్చరించారు. ఈ మేరకు అధికారులు ప్రాజెక్టు వద్ద సైరన్ మోగించారు. దీంతో ప్రాజెక్ట్ సమీపంలోని గ్రామాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వరద ఇంకా పెరిగితే.. సమీప గ్రామాలకు ప్రమాదం పొంచిఉందని అధికారులు పేర్కొంటున్నారు. అధికారుల హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. కడెం, కన్నపూర్, దేవునిగూడెం, రాపర్, మున్యాల్, గొడిషిరియల్ ప్రాంత ప్రజలు తరలి వెళ్తున్నారు.