Telangana: భార్య మెటర్నిటీ వార్డులో ఉంటే.. భర్త ఎమర్జెన్సీ వార్డులో.. చివరకి అదే జరిగింది..!

కొడుకు పుట్టాడన్న ఆనందపడాలో.. భర్త మరణించాడు అని బాధపడాలో.. తెలియక ఓ భార్య మనోవేదనతో తల్లిడిల్లిపోయింది.

Telangana: భార్య మెటర్నిటీ వార్డులో ఉంటే.. భర్త ఎమర్జెన్సీ వార్డులో.. చివరకి అదే జరిగింది..!
Gadwal District Road Accident

Edited By: Balaraju Goud

Updated on: Oct 24, 2024 | 5:35 PM

కొడుకు పుట్టాడన్న ఆనందపడాలో.. భర్త మరణించాడు అని బాధపడాలో.. తెలియక ఓ భార్య మనోవేదనతో తల్లిడిల్లిపోయింది. ఈ హృదయవిదారకర ఘటన జోగుళాంబ గద్వాల్ జిల్లాలో చోటుచేసుకుంది.

రాజోలి మండల కేంద్రానికి చెందిన శివ అనే యువకుడు స్థానిక పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. అతని భార్య మహాలక్ష్మి నిండు గర్భిణీ. అక్టోబర్ 22వ తేది రాత్రి భార్యకు పురిటినొప్పులు వచ్చాయి. సమాచారం అందుకున్న శివ అప్పటికప్పుడు భార్య ఉంటున్న తుమ్మలపల్లెకు బయలుదేరాడు. ఈ క్రమంలో రాజోలి శివారులో బైక్ అదుపుతప్పి కిందపడటంతో శివకి తీవ్రగాయాలు అయ్యాయి. అతన్ని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఏపీలోని కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స అందిస్తున్నారు.

ఇక భార్య మహాలక్ష్మి కి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఆమెను కూడా కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య మెటర్నిటీ వార్డులో ఉంటే.. భర్త ఎమర్జెన్సీ వార్డులో చికిత్సపొందుతున్నాడు. తీవ్ర గాయాలు కావడంతో శివ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్దరాత్రి దాటిన తర్వాత మరణించాడు. మరోవైపు శివ మరణించిన గంటలోనే ఆయన భార్య మహాలక్ష్మి పండంటి మగబిడ్డకు అదే ఆస్పత్రిలో జన్మనిచ్చింది. కొడుకు పుట్టాడని అనందించాలో… భర్త మరణించాడని బాధ పడాలో తెలియని మనోవేదనలో మహాలక్ష్మి కృంగిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. యువకుడు శివ కుటుంబంలో జరిగిన సంఘటనతో రాజోలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దంటూ బాధని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..