Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం.. ఇక మీదట ఎవరి దారి వారిదే..!
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇస్తూనే కొన్ని కీలక షరతులను విధించింది
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 35 రోజులపాటు జైల్లో ఉన్న తర్వాత జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 18న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జానీ మాస్టర్ కు గురువారం కండిషనల్ బెయిల్ కు మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
లైంగిక ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదే కేసులో సెప్టెంబర్ 19న జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుండి జానీ మాస్టర్ చంచల్‌గూడ జైల్లోనే ఉంటున్నారు. జానీ మాస్టర్ కు ఈ కేస్ కారణంగా వచ్చిన నేషనల్ అవార్డును సైతం రద్దు చేశారు. మొదట అవార్డు వచ్చిన కారణంగా రంగారెడ్డి కోర్టు సైతం మధ్యంతర బెయిలు జానీ మాస్టర్ కు మంజూరు చేసింది. కానీ లైంగిక ఆరోపణలకు వేసుకోవడంతో అవార్డును రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. దీంతో జానీ మాస్టర్ కు మంజూరు అయిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు
దీంతో జానీ మాస్టర్ రంగారెడ్డి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు . సుదీర్ఘ వాదన తర్వాత జానీ మాస్టర్ వేసిన బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి కోర్టు తిరస్కరించింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ జానీ మాస్టర్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసుకు సంబంధించిన వివరాలు పరిశీలించిన తర్వాత జానీ మాస్టర్ కు హైకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులను విధించింది
జైలు నుండి విడుదల అయ్యి బయటికి వచ్చిన తర్వాత బాధితురాలితో జానీ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు కానీ ఆమె వ్యవహారాల్లో తలదూర్చకూడదని ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలితో జానీ మాస్టర్ సంప్రదించకుండా ఉండాలని జానీ మాస్టర్‌కు హైకోర్టు షరతు విధించింది. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం జానీ మాస్టర్ చెంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..