
ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఇవి ఎన్నికల ఉచిత హామీలు కావు.. కడుపు మండిన టమాటా రైతుల రెక్కల కష్టం ఉచిత పంపిణీ.. రిటైల్ మార్కెట్లో టమాటా ధరలు రూ 15 నుండి 20 రూపాయలకు కిలో ధరలు పలుకుతున్నాయి.. కానీ సంతలో రైతుల వద్ద మాత్రం కిలో 2 రూపాయలు చెల్లించడానికి వ్యాపారులు కొసరి కొసరి రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో కడుపుమండిన రైతులు తన కడుపు మాడ్చుకొని పంటంతా ఉచిత పంపిణీ చేసి నిరసన తెలుపుతున్నారు. జనగామ, మహబూబాబాద్ జిల్లాలో టమాటా రైతులు ఆవేదనతో.. టమాటాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
టమాటా రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన టామాలను రైతులు అమ్మకం కోసం మార్కెట్ కు తరలిస్తే.. కోనే వారే కరువయ్యారు. కనీస గిట్టుబాటు ధర లేదు.. కిలో టమాటా 2 రూపాయలు పలకడం గగనంగా మారింది. చేతికి అందిన పంట కుళ్ళిపోతుండటంతో కొందరు రైతులు కడుపు మండి వినూత్న నిరసన తెలిపారు. వినియోదారులకు టమాటాలు ఉచిత పంపిణీ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మహబూబాబాద్ జిల్లాలో.. నేడు జనగామ జిల్లాలో వారాంతపు సంతలో ఈ విచిత్ర సంఘటనలు రైతు కుటుంబాలను కలవరపెడుతున్నాయి. ట్రాలీ లోడ్ టమాటలు రైతులు ఉచితంగా పంపిణీ చేశారు.. ఆ టమాటాల కోసం ఎగబడ్డ జనం సంచులు, బుట్టలలో టమాటాలు నింపుకుని పోయారు.
సాధారణ సమయంలో టమాటా ధరలు సెంచరీ కొట్టిన సందర్భం కూడా ఉంది.. కానీ ఇప్పుడు టమాటా ధరలు నెల చూపులు చూస్తున్నాయి.. రైతులు కనీసం కిలో 2 రూపాయల ధర పలకని టమాటా ధర చూసి బిత్తర పోతున్నారు.. చేతికి అందిన ఆ పంటను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలు సంతకు తీసుకువచ్చి అమ్ముతుంటారు.. చిరు వ్యాపారులు రైతుల వద్ద తీసుకెళ్లి మారు వ్యాపారులు చేస్తుంటారు..
అయితే.. ధరలు లేకపోవడంతో టమాటా రైతులు.. తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని వారాంతపు సంతలో ముగ్గురు రైతులు ఒక ట్రాలీ ఆటో లోడు టమాటాలు ఉచితంగా పంపిణీ చేశారు.. గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన సారయ్య, మోహన్, సురేందర్ అనే రైతులు టమాట పంటను అమ్మకానికి తీసుకువచ్చారు.. టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. కనీసం కిలో టమాటా 2 రూపాయలు పలకడం లేదు.. దీంతో తీవ్ర నిరాశ చెంది ట్రాలీ లోడ్ టమాటాలు ఉచితంగా పంపిణీ చేశారు..
తాజాగా జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో కూడా సేమ్ సీన్ జరిగింది.. సదయ్య అనే రైతు ట్రాలీలో టమాటాలు అమ్మకానికి తీసుకువచ్చాడు.. 20 కిలోల టమాటా 40 రూపాయలు కూడా పలకలేదు.. దీంతో కడుపు మండిన రైతు అదే సంతలో వినియోగదారులకు ఉచితంగా టమాటా పంపిణీచేసి తన ఆవేదన వ్యక్తం చేశాడు.
టమాటా ఫ్రీ.ఫ్రీ.ఫ్రీ అనగానే అక్కడ సంతలో ఉన్న జనమంతా సంచులు పట్టుకొని ఎగబడ్డారు.. సంచులు నింపుకొని తీసుకెళ్లారు.. అయితే.. రిటైల్ మార్కెట్లో 15 రూపాయలకు పైగా కిలో టమాటా పలుకుతుంది.. కానీ రైతులకు మాత్రం కనీస గిట్టుబాటు ధరలు రాకపోవడంతో ఇలాంటి దయనీయ పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..