Medak District Farmers Protest: మెదక్ జిల్లాలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓ రైతు కోపంతో.. తనపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అంతేకాదు.. ఏకంగా తహశీల్దార్‌పై కూడా పోశాడు. అయితే ఎవరికీ ఎలాంటి అపాయం కాలేదు. పక్క ఉన్న మిగతా రైతులు అప్రమత్తం అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మెదక్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
శివ్వంపేట తహశీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. తాళ్లపల్లిగడ్డ తండాకు చెందిన ఓ రైతు విద్యుత్‌షాక్‌తో చనిపోయాడు. సకాలంలో తహశీల్దార్ భానుప్రకాశ్ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకపోవడంతో పాటు రైతు బీమా నగదు పొందలేకపోయారు దీంతో ఆగ్రహనికి గురైన సదరు రైతు గ్రామంలోని మిగిలిన రైతులతో కలిసి మండల ఆఫీసుకు చేరుకున్నారు. తహశీల్దార్ కార్యాలయం ముందు మృతదేహాన్ని ఉంచి నిరసన వ్యక్తం చేశారు.
తహశీల్దార్ నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగిందంటూ రైతులు కోపోద్రిక్తులయ్యారు. ఇదే క్రమంలో ఓ రైతు వెంట తెచ్చుకున్న డీజిల్ బాటిల్‌ను ముందుగా తనపై పోసుకున్నాడు. అప్పటికే రైతులను తహశీల్దార్ సముదాయించే యత్నం చేస్తున్నారు. అయినా వినిపించుకోలేదు. ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగే క్రమంలో.. ఆ రైతు మిగతా డీజిల్‌ను తహశీల్దార్‌పై పోశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు. డీజిల్ పోసిన రైతుకు సద్దిచెప్పే యత్నం చేశారు.
ఇదిలావుంటే, తాళ్లపల్లిగడ్డ తండాకు చెందిన మాలోతు బాలు అనే రైతు విద్యుదాఘాతంతో మృతిచెందడంతో ఇప్పుడా కుటుంబం వీధిన పడిందని వాపోయారు రైతులు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున సాయం చేయాలని గ్రామస్థులతో కలిసి ఆందోళనకు దిగారు. నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై మరింత ఆగ్రహానికి గురయ్యారు. అదే సమయంలో తహశీల్దార్ భానుప్రకాశ్ కార్యాలయం నుంచి బయటకు వెళ్తుండగా ఓ రైతు అతన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పక్కనే ఉన్న సిబ్బంది అప్రమత్తం అవ్వడం వల్ల పెనుప్రమాదం తప్పింది.