తెలుగు రాష్ట్రాల్లో హోమియోపతి వైద్యానికి చిరునామాగా మారిన డాక్టర్ పావులూరి కృష్ణచౌదరి (96) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి హైదరాబాదు అమీర్ పేటలోని ఆయన స్వగృహంలో మరణించారు. నాలుగు నెలల కిందట గుండె కవాట మార్పిడి చికిత్స జరిగింది. గత కొన్ని రోజులుగా ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్నారు.
కృష్ణ చౌదరి భార్య సుందర రాజేశ్వరి 2010లోనే కన్నుమూశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.. పెద్ద కుమారుడు 18 ఏళ్ల ప్రాయంలోనే మృతి చెందారు. రెండో కుమారుడు డాక్టర్ నరేంద్రనాథ్ అమెరికాలో డాక్టర్ గా సేవలను అందిస్తున్నారు. వీరి ఏకైక కుమార్తె అపర్ణ కూడా డాక్టర్. హైదరాబాద్ లో స్థిర నివాసం.. హోమియో వైద్య నిపుణురాలిగా పేరుగాంచారు. కుమారు అమెరికా నుంచి వచ్చిన అనంతరం అంత్యక్రియలను నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. వ్యక్తిగా డాక్టర్ గా అర్ధవంతమైన జీవితాన్ని గడిపారంటూ స్నేహితులు, సన్నిహితులు ఆయనతో బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
వాస్తవానికి ఎంబీబీఎస్ చదివిన కృష్ణ చౌదరి హోమియో వైద్య వ్యాప్తి అపార కృషి చేశారు. ఆంగ్ల వైద్యం అల్లోపతి సహజ వైద్యం హోమియోపతిని మిక్స్ చేసి వ్యాధులకు చికిత్సను అందించేవారు. రోగులకు అయ్యే ఖర్చులను తగ్గించడానికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించడానికి 90 ఏళ్ల వయసులోనూ శ్రమించారు. అపర ధన్వంతరిగా ఖ్యాతిగాంచారు కృష్ణ చౌదరి.
డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి 1926 జూన్ 30న జన్మించారు. 2023 జనవరి 12న కన్నుమూశారు. ఎంబీబీఎస్ చదివిన కృష్ణ చౌదరి హోమియో వైద్య విధానమే మేలు అని అనుకున్నారు.. దీంతో లండన్ వెళ్లి హోమియో వైద్య విద్యను అభ్యసించి పట్టభద్రుడయ్యారు. స్వదేశానికి తిరిగివచ్చి జీవితమంతా పూర్తిగా హోమియో వైద్యం అభివృద్ధికి కృషిచేశారు. తెలుగు రాష్ట్రాల్లో హోమియో వైద్యంతో శిఖర సమానుడుగా ఎదిగారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..