Telangana: డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. కొత్త స్కామ్‌తో వ్యాపారులకు కుచ్చుటోపీ.. అసలేం జరిగిందంటే..?

ఆన్‌లైన్ పేమెంట్ల కాలంలో వ్యాపారులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. డబ్బులు అకౌంట్‌లో పడకపోయినా.. బీప్ శబ్దంతో పడినట్లు నమ్మించి మోసం చేసే నకిలీ ఫోన్ పే యాప్ ముఠా బయటపడింది. ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు.. సామాన్యులను, చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు.

Telangana: డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. కొత్త స్కామ్‌తో వ్యాపారులకు కుచ్చుటోపీ.. అసలేం జరిగిందంటే..?
Fake Phonepe App Scam

Edited By:

Updated on: Mar 01, 2026 | 11:50 AM

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన ముత్యాల గోపి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సిద్దాపురం కార్తీక్.. జగ్గయ్యపేటలోని కృష్ణంపేటలో ఉంటున్నాడు. అయితే వీరిద్దరూ స్నేహితులుగా మారారు. జల్సాల కోసం డబ్బులు ఈజీగా సంపాదించేందుకు పథకం వేశారు. నకిలీ ఫోన్ పే యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా సామాన్యులు, చిరు వ్యాపారులను ఆన్ లైన్ చెల్లింపుల పేరుతో మోసం చేస్తున్నారు. ఈ కేటుగాళ్లు అత్యంత రద్దీగా ఉన్న దుకాణాలను ముందుగానే గుర్తిస్తారు. అలాంటి దుకాణాలకు వెళ్లి నిత్యవసర సరుకులు, కిరాణా సామాన్లు కొనుగోలు చేస్తారు.

ఈ నకిలీ యాప్ ద్వారా స్కాన్ చేస్తే డబ్బులు చెల్లించినట్లు బీప్ శబ్దం వచ్చి నగదు పంపినట్లు చూపిస్తుంది. కానీ చెల్లింపులు జరగవు. బిజీగా ఉండే వ్యాపారులు బీప్ శబ్దంతో నగదు వచ్చినట్లుగా భావిస్తుంటారు. ఇలా వ్యాపారులను మోసం చేసి తీసుకువచ్చిన సరుకులను తక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. కార్తీక్ జనవరి 26న సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో శ్రీరామ్ సీతారాములు కిరాణ వ్యాపారి వద్ద రూ.25 వేల విలువ చేసే కిరాణ సరుకులను కొనుగోలు చేశారు. వాటికి సంబంధించి డబ్బులు నకిలీ యాప్ ద్వారా ఫోన్ పే చేశారు. బీప్ శబ్దం రావడంతో నగదు వచ్చిందని కిరాణా వ్యాపారి కూడా భావించాడు. ఈ కేటుగాళ్లు వెళ్లిన తర్వాత తన అకౌంట్ ను పరిశీలించగా నగదు రాని విషయాన్ని గుర్తించాడు. దీంతో సదరు వ్యాపారి గరిడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గరిడేపల్లిలోని పోనుగడు క్రాస్ రోడ్డు వద్ద అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నంబర్ కనిపించకుండా స్టిక్కర్ వేసి ఉన్న కారును ఆపారు. కారులోని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా నకిలీ యాప్ ద్వారా వ్యాపారులను మోసం చేస్తున్న బండారం బయట పడింది. పది రోజుల వ్యవధిలో హుజూర్ నగర్ లోని రెండు ప్రాంతాల్లో, గరిడేపల్లి, మఠంపల్లి, మిర్యాలగూడ, త్రిపురారం, మేళ్లచెరువు గ్రామాల్లో ఈ నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా మోసాలకు పాల్పడ్డారని హుజూర్ నగర్ సిఐ చరమందరాజు తెలిపారు. వీరి వద్ద రూ.1.26 లక్షల నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి నకిలీ యాప్‌లతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Follow Us