
మునుగోడు ప్రజలు డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకు లొంగరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్, దుబ్బాక ప్రజల పేరిట వెలసిన పోస్టర్లు బూటకమంటూ తిప్పికొట్టారు. తనను గెలిపించి ప్రజలు బాధపడటం లేదని పేర్కొన్నారు. తాను గెలిచిన రోజు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు మొత్తం దీపావళి పండుగ చేసుకున్నారని తెలిపారు. చైతన్యానికి మారుపేరు హుజురాబాద్ అంటూ పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు హుజురాబాద్ ను ఆదర్శంగా తీసుకుంటున్నారని వివరించారు.
మంత్రి మల్లారెడ్డి మద్యం తాగి మునుగోడు ప్రజలను అవమానపరిచారని ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో అత్యధికంగా చనిపోయింది మునుగోడు బిడ్డలేనంటూ ఈటల పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే భూస్వాములకు రైతుబంధు రద్దు చేస్తామని పేర్కొన్నారు. కౌలు రైతులకు కౌలు బంధు అందిస్తామని హామీనిచ్చారు. గల్లి గల్లిలో బెల్ట్ షాపులతో మహిళలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏకే 47 కంటే విలువైనది ఓటు.. అని గుర్తించుకోవాలని సూచించారు. ఓటు ప్రజల తలరాతను మారుస్తుందని.. ఓటు అమ్ముకోవద్దంటూ ప్రజలను కోరారు. ఆత్మ గౌరవం గల వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని.. బీజేపీ వస్తేనే తెలంగాణ ప్రజలలో మార్పు వస్తుందని తెలిపారు.
ఓ వైపు వర్షం కురుస్తున్నప్పటికీ.. ఈటల జోరుగా ప్రచారం నిర్వహించారు. వర్షంలోనూ కార్యకర్తలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..