
ఓ రైతు కోసం ఊరు ఊరంతా కదిలింది. మీ కుటుంబానికి మేమున్నామంటూ అభయహస్తం అందించింది. కబ్జాకు గురైన భూమిలో మూకుమ్మడిగా దుక్కులు దున్నారు. విత్తనాలు నాటి అన్నదాతకు అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా(Adilabad district) తలమడుగు మండలం(Talamadugu)కజ్జర్ల(Kajjarla) గ్రామానికి చెందిన యాళ్ల జైపాల్ రెడ్డి తండ్రి రాజారెడ్డి..36 ఏళ్ల క్రితం అబ్దుల్ ఘని అనే వ్యక్తి తండ్రి వద్ద 8 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. అప్పట్లో పెద్దమనుషుల సమక్షంలో బాండ్ పేపర్ మీద రాయించుకున్నారు. 36 ఏళ్లుగా భూమి సాగుచేసుకుంటున్నప్పటికీ పట్టా చేయించుకోలేదు. మూడేళ్ల కింద రాజారెడ్డి చనిపోవడంతో భూమి పట్టా కోసం ఆయన కొడుకు జైపాల్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఐతే ధరణి రాకతో రాజారెడ్డి భూమికి పట్టా కాలేదు. దీనికితోడు అబ్ధుల్ ఘనీ పేరిట కొత్త పట్టా పాస్‌బుక్ రావడంతో అసలు సమస్య తెరమీదికొచ్చింది. జైపాల్ రెడ్డి సాగు చేస్తున్న భూమి తమదేనని, ఖాళీ చేసి తమకు అప్పగించాలని ఘనీ కొడుకులు..జైపాల్‌రెడ్డిని, ఆయన కొడుకు చరణ్‌రెడ్డిని బెదిరించారు. పొలంలోకి అడుగు పెట్టవద్దంటూ దౌర్జన్యం చేశారు. రియల్ మాఫియాతో వచ్చి జైపాల్‌రెడ్డి కుటుంబంపై దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన జైపాల్‌రెడ్డి, చరణ్ రెడ్డి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే వారిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు స్థానికులు. ఈ ఘటనతో భగ్గుమన్న కజ్జర్ల గ్రామస్తులు..జైపాల్‌రెడ్డిపై దాడికి తెగబడ్డవారిని అరెస్ట్ చేయాలని ఆందోళనకు దిగారు. జైపాల్ రెడ్డికి అండగా నిలిచారు. ఆయన సాగు చేసుకుంటున్న భూమికి ఊరంతా మూకుమ్మడిగా వెళ్లి నాగళ్లతో దుక్కులు దున్ని సాగు చేశారు. జైపాల్ రెడ్డి కుటుంబానికి ఊరంతా అండగా ఉంటుందని..ఎవ్వడు భూమిని లాక్కుంటాడో రమ్మంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కజ్జర్ల గ్రామస్తులు..అధికారులు స్పందించి జైపాల్‌రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని..లేదంటే ఐక్య పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..