వరంగల్ రాజకీయాల్లో మరోసారి రగిలిన రగడ.. కడియం టార్గెట్‌గా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కడియం శ్రీహరి తనను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. తన శాఖకు సంబంధించిన అంశాలపై జరుగుతున్న వివాదంపై స్పందించిన మంత్రి, ప్రోటోకాల్ ఉల్లంఘనల అంశాన్నే తాను ప్రస్తావించానని స్పష్టం చేశారు.

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కడియం శ్రీహరి తనను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. తన శాఖకు సంబంధించిన అంశాలపై జరుగుతున్న వివాదంపై స్పందించిన మంత్రి, ప్రోటోకాల్ ఉల్లంఘనల అంశాన్నే తాను ప్రస్తావించానని స్పష్టం చేశారు.
దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లడాన్ని తాను ఎప్పుడూ తప్పుపట్టలేదని కొండా సురేఖ తెలిపారు. అయితే ఒక ఎమ్మెల్యే నేరుగా మంత్రి శాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం సరైన పద్ధతి కాదని, ఇది ప్రభుత్వ ప్రోటోకాల్‌కు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. రాష్ట్రంలో వందలాది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఎవరైనా తమ నియోజకవర్గ సమస్యలపై మంత్రులను కలిసి చర్చించవచ్చని, కానీ శాఖ కార్యాలయాల్లో నేరుగా సమీక్షలు నిర్వహించడం సరైన విధానం కాదని అన్నారు.
కడియం శ్రీహరి ఈ విషయంపై తనకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల హోదాలు, మంత్రుల అధికార పరిధికి సంబంధించిన కనీస అవగాహన ఉండాలని సూచించారు. తనపై కడియం శ్రీహరి చేస్తున్న వ్యాఖ్యలు, ప్రవర్తన ఒక బీసీ మహిళగా తనను అవమానించే విధంగా ఉన్నాయని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు సహజమేనని, అయితే వ్యక్తిగత స్థాయిలో గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
తనపై జరుగుతున్న విమర్శల వెనుక రాజకీయ కుట్ర ఉందని మంత్రి సురేఖ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొందరు నేతలు తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. కడియం శ్రీహరి కూడా టీడీపీ నుంచి వచ్చిన నాయకుడు కావడంతోనే తనపై ప్రత్యేకంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అసలు కాంగ్రెస్ నాయకులతో తనకు ఎలాంటి సమస్యలు లేవని, పార్టీ మారి వచ్చిన కొందరు నేతలే తనపై ఫిర్యాదులు చేస్తూ రాజకీయంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం పనిచేస్తున్నానని కొండా సురేఖ గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడమే తన లక్ష్యమని చెప్పారు. అయితే కొందరు కావాలనే వివాదాలు సృష్టించి తన ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదంపై కడియం శ్రీహరి వర్గం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు కీలక నేతల మధ్య పెరుగుతున్న ఈ విభేదాలు రానున్న రోజుల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
