ఏపీ, తెలంగాణలో మరో 10 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది మార్చి 29తో ముగియనున్న MLAకోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఈక్రమంలో ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 6న నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా, మార్చి 23న పోలింగ్, కౌంటింగ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్ లో 7 ఎమ్మెల్సీ స్థానాలకు.. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. ఏపీలో నారా లోకేశ్, పోతుల సునీత, బత్తుల అర్జునుడు, డొక్కా మాణిక్య వర ప్రసాదరావు, వరాహ వెంకట సూర్య నారాయణ రాజు, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. మరో సభ్యుడైన ఎమ్మెల్సీ ఛల్లా భగరీథ రెడ్డి గతేడాది నవంబర్ లో కన్నుమూయడంతో.. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇక.. తెలంగాణలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్ ల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. కాగా ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అధికార వైఎస్సార్సీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
సూర్యనారాయణ రాజు (విజయనగరం), పోతుల సునీత(బాపట్ల), కోలా గురువులు (విశాఖ), బొమ్మి ఇజ్రాయెల్ (కోనసీమ), జయమంగళ వెంకటరమణ (ఏలూరు), చంద్రగిరి ఏసురత్నం (గుంటూరు), మర్రి రాజశేఖర్ (పల్నాడు) లను అభ్యర్థులుగా సీఎం జగన్ ప్రకటించారు. ఇక తెలంగాణలో.. ఖాళీ అవుతోన్న 3 స్థానాలకు అధికార బీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే మూడు స్థానాలు బీఆర్ఎస్ కే దక్కే అవకాశాలు ఉన్నాయి. మరి సీఎం కేసీఆర్ ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తారో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేంయడి..