
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికార యంత్రాంగం.. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సోదాలు చేపడుతున్నారు. ఇప్పటికే పోలీసుల తనిఖీల్లో కోట్లాది రూపాయలు పట్టుబడ్డాయి. ఇక ఆన్‌లైన్‌లో అడ్డగోలుగా జరిగే నగదు లావాదేవీల కట్టడికి సైతం ఎన్నికల అధికారులు సమాయత్తమవుతున్నారు.
గత శాసనసభ ఎన్నికల సమయంతో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు రెట్టింపయ్యాయి. చిన్న మొత్తాల్లో సొమ్మును గూగుల్ పే, ఫోన్‌పే, ఇతర యూపీఐ యాప్‌లతో చెల్లిస్తున్నారు. దీంతో డిజిటల్ పేమెంట్స్‌పై ఈసీ ఫోకస్ పెట్టింది. గూగుల్ పే, ఫోన్ పేలో ఓటర్లకు డబ్బులు పంపుతున్న అంశంపై ఈసీ సీరియస్ యాక్షన్‌కు రెడీ అయింది. ఇందులో భాగంగానే వ్యక్తిగత ఖాతాలతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఖాతాలపై ఈసీ కన్నేసింది.
ఆయా బ్యాంకు అధికారులతో ఎన్నికల సంఘం వరుస భేటీలు నిర్వహిస్తోంది. రోజువారీగా అనుమానిత, ఎక్కువ మొత్తంలో నగదు చెలామణి అవుతున్న ఖాతా లిస్ట్‌ను ఇవ్వాలని బ్యాంకులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఒకే ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయ్యే ఖాతాలపై ప్రధానంగా ఓ కన్నేసి పెట్టింది.
GPay, PhonePe, BhimApp వంటి ఇతర యాప్‌లను ఉపయోగించి చెల్లింపు చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఈసీ. ఓటర్లు ఎన్‌క్యాష్ చేసుకునే అడ్వాన్స్ వోచర్ల ద్వారా చెల్లింపులు జరుగుతాయని ఇంటెలిజెన్స్ అధికారులు ఈసీ దృష్టికి తీసుకొచ్చినట్లుగా సమాచారం.
అయితే, అలాంటి లావాదేవీలను నిరోధించేందుకే ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు ఎన్నికల అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రతి జిల్లాలో విశ్లేషకులను నియమించినట్లుగా తెలుస్తోంది. అవసరమైన డేటాను అందించాలని బ్యాంకులను కోరే అవకాశం ఉంది. ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.
అలాగే, భారతదేశంలో రిటైల్ చెల్లింపు, సెటిల్‌మెంట్ వ్యవస్థలను నియంత్రించే సంస్థ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), RBI, రాష్ట్ర స్థాయిలో నోడల్ బ్యాంకర్స్ అసోసియేషన్, డిజిటల్ చెల్లింపు సంస్థలతో ఈ సమస్యపై EC సమావేశం కానున్నారు. GPay, PhonePe, Airtel చెల్లింపు, UPI, BHIM ఇటీవల పెరిగిపోవడమే ఇందుకు కారణం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి