
కల్వకుంట్ల కవిత స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీకి ఎన్నికల సంఘం (EC) నుంచి కీలక ఆదేశాలు వెలువడ్డాయి. పార్టీ పేరుపై ప్రజల నుంచి భారీగా అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో, ఆ పేరును కొనసాగించేందుకు వీల్లేదని ఈసీ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో కొత్తగా ఏర్పాటైన ఈ పార్టీకి ప్రారంభ దశలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
‘తెలంగాణ రక్షణ సేన’ పేరుపై పలు అభ్యంతరాలు నమోదయ్యాయని ఈసీ లేఖలో పేర్కొంది. అందువల్ల పార్టీ మూడు ప్రత్యామ్నాయ పేర్లు 15 రోజుల్లో సమర్పించాలని సూచించింది. లేకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును మూసివేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ‘టీఆర్‌ఎస్’ అనే సంక్షిప్త నామంపై కూడా అభ్యంతరాలు ఉన్నాయని, ఇది ఇప్పటికే ఉన్న రాజకీయ గుర్తింపులతో గందరగోళం సృష్టించే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నట్లు సమాచారం.
అయితే ఈసీ ఆదేశాలపై కవిత తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ పేరు మార్చే ప్రసక్తే లేదని, ఇప్పటికే ఈసీ అభ్యంతరాలకు వివరణ ఇచ్చామని తెలిపారు. రెండు సార్లు లేఖల ద్వారా తమ వైఖరిని స్పష్టం చేసినప్పటికీ, మళ్లీ పేరు మార్చాలని సూచించడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై న్యాయపరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా కవిత స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇక టీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధులు కూడా ఈసీ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు కేవలం రెండు అభ్యంతరాలే తెలియజేయగా, మిగతా అభ్యంతరాలు లేకుండానే ప్రత్యామ్నాయ పేర్లు ఎలా సూచించాలన్న ప్రశ్నను వారు లేవనెత్తారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
ఇదిలావుంటే, ఏప్రిల్ 25న ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో కవిత కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ పరిణామాలతో పార్టీ పేరుపై స్పష్టత రాకుండా కొనసాగుతున్న వివాదం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ పేరు వివాదం మరింత ముదిరితే, రాబోయే రోజుల్లో ఇది న్యాయస్థానానికి చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..