
తెలంగాణలో ఎల్‌నివో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 12,760 గ్రామాల్లో 11,479 గ్రామాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలో వెల్లడించింది. అంటే రాష్ట్రంలోని 92.08 శాతం గ్రామాలు ఎల్నినో ప్రభావ పరిధిలోకి వచ్చినట్లు అంచనా. వ్యవసాయశాఖ 29 జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 892 గ్రామాలు అత్యంత తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. మరో 7,939 గ్రామాల్లో తీవ్ర స్థాయిలో, 2,998 గ్రామాల్లో మోస్తరు స్థాయిలో ఎల్‌నివో ప్రభావం నమోదైంది. ఈ పరిస్థితులు వ్యవసాయంతో పాటు నీటి వనరులు, గ్రామీణ జీవన విధానం, స్థానిక ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో మొత్తం 1,32,38,446 ఎకరాల్లో సాగు లక్ష్యంగా ఉండగా.. ఇప్పటివరకు 59,83,971 ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు. ఇది మొత్తం లక్ష్యంలో 45.20 శాతం మాత్రమే. ఇంకా 72,54,475 ఎకరాల్లో సాగు ప్రారంభం కావాల్సి ఉంది. వీటిలో దాదాపు 60 శాతం వర్షాధార సాగు కావడంతో వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
వర్షాలు ఆలస్యమైతే విత్తనాల వేయడం ఆలస్యం కావడంతో పాటు మొలకలు సరిగా రాకపోవడం, తిరిగి విత్తాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. పత్తి, వరి, మొక్కజొన్న, సోయాబీన్, వేరుసెనగ వంటి ప్రధాన పంటల సాగు విస్తీర్ణం తగ్గే ప్రమాదం ఉంది. పండ్ల నాణ్యత, దిగుబడులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. వర్షాభావం కొనసాగితే చెరువులు, కుంటలు, వాగులు త్వరగా ఎండిపోయే అవకాశం ఉంది. భూగర్భ జలమట్టం పడిపోవడంతో తాగునీరు, సాగునీటి కొరత ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పశువులకు పచ్చిమేత కొరత ఏర్పడి పాల ఉత్పత్తి తగ్గడంతో పాటు వాటి ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశముంది.
వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గడం, రైతుల పెట్టుబడి వ్యయాలు పెరగడం, అప్పుల భారం అధికమవడం వంటి సమస్యలు తలెత్తవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వలసలు పెరిగే అవకాశాన్ని కూడా ప్రణాళికలో ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో రైతులు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ వ్యవసాయశాఖ సూచనలను పాటించాలని ప్రభుత్వం సూచించింది. తక్కువ కాలంలో పండే, కరవును తట్టుకునే పంటలను ఎంచుకోవాలని, వర్షపు నీటిని చెరువులు, నీటికుంటలు, ఇంకుడు గుంతల ద్వారా నిల్వ చేయాలని సూచించింది. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులు, మల్చింగ్ వంటి నేల తేమను కాపాడే చర్యలను విస్తృతంగా అమలు చేయాలని రైతులకు సూచించింది.