మండువేసవికి ముందే భానుడి ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఏప్రిల్ నెల రాకముందే ఎండల తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా భానుడి భగభగలు కనిపిస్తున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సీయస్ కు చేరుకుంటున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కారణంగా ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మే, ఏప్రిల్ నెలలో ఉండాల్సిన ఎండలు మార్చి రెండోవారంలోనే ప్రతాపం చూపిస్తున్నాయి. ఉదయం 9గంటలు దాటితే చాలు భానుడి భగభగలు మండిస్తున్నాడు. ఎండల వేడికి ఉక్కపోత సైతం తోడు కావడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. వరుసగా ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుతుండడంతో వచ్చే రెండు నెలల్లో ఎండల తీవ్రతను తలుచుకుంటేనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 8 నుంచి 40డిగ్రీల సెల్సియస్ చేరువగా ఉష్ణోగ్రతలు నమోద అయ్యాయి. మార్చి 8 నుంచి నాగర్ కర్నూల్లో 39.8, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేటలో 39.7, గద్వాల్లో 39.6 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన ఐదురోజుల్లో ఉమ్మడి జిల్లాలో 2.6డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి.
ఉదయం 9గంటలకే భానుడి భగభగలు మొదలై సాయంత్రం 6గంటల వరకు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్నానికే పనులు ముగించుకొని ఇళ్లకు చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం వేళ ఎండ తీవ్రత తగ్గిన తర్వాతే ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వస్తున్నారు. అటు ఎండల వేడికి ఇళ్లలో విద్యుత్ వినియోగం గరిష్ఠానికి చేరుకుంటోంది. ఇప్పుడే సూర్యుడు ఈ విధంగా ప్రతాపం చూపిస్తే రానున్న రోజుల్లో వేసవిని తలుచుకుంటేనే జిల్లా ప్రజలు భయపడుతున్నారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో మిట్టమధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..