Rains: గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా బొగ్గు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పెద్దపల్లి జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల బొగ్గు ఉపరితల గనులు చెరువులను తలపిస్తున్నాయి. రామగుండం ఏరియా పరిధిలోని ఓపీసీ- 1, 2 ల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపీసీ టూ లోకి వెళ్లే దారి వరదనీటితో కట్ కావడంతో క్వారీలోకి వెళ్లే రోడ్డు మూసుకుపోయింది. దీంతో కార్మికులు గనుల్లోకి వెళ్లలేక పోతున్నారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోజూ సుమారు యాభై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం ఏర్పడుతోంది.
పెద్దపల్లి జిల్లా- రామగుండం సింగరేణి గనుల్లో మూడు రీజియన్లలో నాలుగు ఓపెన్ కాస్ట్ గనులున్నాయి. ఇక్కడ ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. అయితే వర్షాలతో రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం నీటి కారణంగా.. భారీ యంత్రాలు కదల్లేని దుస్థితి ఏర్పడింది. దీంతో బొగ్గు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా రూ. 2 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. వర్షం తగ్గితేనే ఉత్పత్తి జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గనుల్లో ఇలాంటి సమస్యే తలెత్తుతోంది. ఇప్పటి వరకు కొత్తగూడెంలో 27 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మోటార్లతో నీటిని బయటకు తోడుతున్నా.. వర్షాలకు మళ్లీ నీళ్లు చేరుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ఇల్లెందులో వర్షాలకు సింగరేణి ఏరియాలోని ఓపెన్‌కాస్ట్‌లో వరద నీరు చేరింది. దీంతో ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. ఇల్లెందు పదో గనిలో10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. టేకులపల్లి కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. 40వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీసే పనులకు అంతరాయం జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..