Dowry-Free Weddings: కట్నాలు లేని కళ్యాణం.. ఆ గూడాల్లో ఆ నియమాలు పాటించి తీరాల్సిందే

Dowry-Free Weddings: తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు యథావిధిగా కొనసాగించడం, పెళ్లిల్లో అక్కాచెల్లెల్లు తప్ప ఇతరులకు అహేరి(కానుక)లు రద్దు చేయుడం, సామూహిక వివాహాలు చేయడం, ఎర్రబోట్టు కార్యక్రమంలో సాల్ ముద్ద(బంగారపు ఉంగరం) ఇవ్వరాదు. పెళ్లిచూపులకు పది మంది కంటే ఎక్కువ మంది వెళ్లరాదు..

Dowry-Free Weddings: కట్నాలు లేని కళ్యాణం.. ఆ గూడాల్లో ఆ నియమాలు పాటించి తీరాల్సిందే
Dowry Free Weddings

Edited By:

Updated on: Apr 15, 2026 | 7:06 PM

Dowry-Free Weddings: తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను కాపాడడానికి ఆదివాసీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రోజురోజుకూ మారుతున్న కాలంలో ఆదివాసీలు తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికి విశేష కృషి చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా మండలాల్లో రాయిసెంటర్ల  ఆధ్వర్యంలో గ్రామాల పెద్దలతో సమావేశాలు నిర్వహించి తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పాత పద్ధతిలో పెళ్లిలు నిర్వహణ, కట్నకానులకు దూరంగా ఉండాలని గ్రామాల పెద్దల సమక్షంలో తీర్మానాలు చేస్తున్నారు. ఆడపడుచు కుటుంబానికి ఇబ్బందిగా మారిన కట్నకానుకలను రద్దు చేస్తూ.. కఠిన నిబందనలు అమలు చేస్తున్నారు.

కట్నం ఇవ్వొ ద్దు.. తీసుకోవద్దు.. పెండ్లిళ్లకు కట్నకానులను బంద్ చేయాలి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని ఆదివాసీ గూడాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ తీర్మానాలే కనిపిస్తున్నాయి. జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్, కెరమెరి, ఇంద్రవెల్లి మండలాల్లోని ఆదివాసీ గ్రామాల్లో తీర్మానాలు చేసుకున్నారు. దాదాపు 20 కి పైగా గ్రామాలు ఈ నిర్ణయాలు తీసుకుని మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. గతంలో ఆదివాసీల పెండ్లిళ్లు కుటుంబీకులకు, బంధువులు, గ్రామస్తుల మధ్య జరిగేవి. పెద్దగా ఖర్చులు లేకుండా సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలు నిర్వహించుకునేవారు. కాలక్రమేనా కట్నాలు, ఖరీదైన కానుకలు ఇవ్వడం ఆదివాసీ ల్లోనూ షురూ అయ్యింది. దీనితో పేద ఆదివాసీ కుటుంబాలపై భారం పడింది. గతంలో ఆదివాసీల్లో కట్నం ఇచ్చే పద్ధతి ఉండేది కాదు. రెండు కుటుంబాల అంగీకారం, కొద్దిపాటి సరుకులు, వస్తువులతో పెండ్లి తంతు పూర్తయ్యేది. బయటి గ్రామాలతో అనుబంధం పెరుగడం వల్ల ఆదివాసీల్లో మార్పు వచ్చింది. పెండ్లిళ్లలో బిందెలు, ప్లేట్లు, అల్మారీలు, సోఫా సెట్లు, బెడ్లు,డెకరేషన్ వస్తువులు, ఖరీదైన దుస్తులు ఇవ్వడం పెరిగింది. కొందరు బైక్లు కూడా ఇస్తున్నారు. వాళ్లు అంతిచ్చారు.. మీరు తక్కువిచ్చారని పోలుస్తుండడంతో కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నా యి. దీంతో కట్నకానుకలకు పోటీ పెరిగి పేదలపై భారం పడుతోంది. పెండ్లిళ్ల కోసం అప్పులు చేసిన వారు తీర్చలేక అవస్థలు పడుతున్నారు.

ప్రస్తుత కాలంలో కొనసాగుతున్న వరకట్నాలు, కానుకలతో నిరుపేద కుటుంబీకులు పెళ్లిలు చేయాలంటే ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. రాయిసెంటర్ సమావేశంలో ఆదివాసీ పెద్దలు చేసిన తీర్మానాన్ని ఆదివాసీ గ్రామాల్లో అమలు చేసి పాత పద్ధతి, తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహరాలు, సంస్కృతి, సంప్రదాయాలను అన్ని గ్రామాల్లో అమలు చేయాలనీ ఆదివాసీ పెద్దలు నిర్ణయిస్తున్నారు. దీనితో కొన్ని ఆదివాసీ గ్రామాలు మార్పునకు నాందిపలుకుతున్నాయి. పెండ్లిళ్లలో కట్నకానుకలను నిషేధిస్తూ తీర్మానాలు చేసుకుంటున్నారు. గ్రామంలో చందాలు వసూలు చేసి  పేద కుటుంబానికి పెండ్లి కోసం సాయం అందిస్తున్నారు. ఈ విధానం అమలు చేయడంలో జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల్లోని పలు గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆదివాసీ సమాజాన్ని తిరిగి సంప్రదాయ విలువల వైపు తీసుకెళ్తున్నాయని ఆదివాసీ పెద్దలు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు యథావిధిగా కొనసాగించడం, పెళ్లిల్లో అక్కాచెల్లెల్లు తప్ప ఇతరులకు అహేరి(కానుక)లు రద్దు చేయుడం, సామూహిక వివాహాలు చేయడం, ఎర్రబోట్టు కార్యక్రమంలో సాల్ ముద్ద(బంగారపు ఉంగరం) ఇవ్వరాదు. పెళ్లిచూపులకు పది మంది కంటే ఎక్కువ మంది వెళ్లరాదు. పెళ్లి వేడుకల్లో సంప్రదాయ డోళ్లు మాత్రమే ఉపయోగించాలి. వధువును పెళ్లికి ఒక రోజు ముందే పెళ్లి కొడుకు గ్రామానికి పంపించాలి. నిర్ణయించిన సమయంలో పెళ్లి చేయాలి. అక్షింతలు పసుపుతో కలిపిన బియ్యం మాత్రమే వాడాలి.

వధూవరులకు ముఖాముఖిగా తమకు తోచిన కట్నకానుకలు ఇవ్వాలి. వివాహ వేడుకల్లో వరుడు దోతి, రూమల్ ధరించాలి. పెళ్లి మండపంలో కరెకోపాల నీటితో మండపం వద్దనే స్నానం చేయించాలి. కట్నం, హుండీ, బండి, బెడ్, కూలర్, ప్రీజ్ ఇవ్వడం రద్దు చేస్తూ తీర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్, వడగామ్, ఇంద్రవెల్లి తదితర రాయిసెంటర్లలో సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేశారు…వరకట్నం అనేది తమ సంస్కతిలో భాగం కాదని నిషేధించాలని తీర్మానం చేశారు. ఆడంబరాలకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. పెళ్లిళ్లు సాంప్రదాయబద్ధంగా ఉండాలని, లక్షలు ఖర్చయ్యే రెడీమేడ్ మండపాలకు దూరంగా ఉండడంతో పాటు మద్యపానం నిషేధించాలన్నారు. డీజేలు వంటి వాటి జోలికి వెళ్లకుండా సంప్రదాయ వాయిద్యాలతో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పెళ్లిలో చదివింపుల్లో భాగంగా వస్తువులు కాకుండా నగదు రూపంలో అందిస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని తీర్మానాలు చేస్తున్నారు.

గ్రామ పెద్దలు తీసుకునే కట్నకానుకల నిషేధ నిర్ణయం ఐక్యతను కాపాడుతోందనీ దీనివల్ల ఉన్నోడు, లేనోడు అనే వ్యత్యాసం ఉండదనీ…ఆదివాసీ నాయకులు చెపుతున్నారు. ఆదీవాసి గ్రామాల్లో పెద్దలు తీసుకునే నిర్ణయం భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని..ఈ విధానం పెండ్లిళ్లకే కాకుండా ఇతర కార్యక్రమాలకు అమలు చేస్తే పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆదివాసి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us