Telangana Rythu Bandhu : తెలంగాణలో 60.84 లక్షల మంది రైతులకు రూ.7360.41 కోట్ల రైతుబంధు నిధులను పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తం 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు అందించామన్నారు. మిగిలిన రైతులు తమ ఖాతాల వివరాలు సమర్పించనట్లయితే స్థానిక ఏఈఓలను సంప్రదించాలన్నారు. అయితే ఖాతాలు సమర్పించిన రైతులకు వారి వారి ఖాతాలలో నిధులు జమ చేస్తామని తెలిపారు. రైతుబంధు నిధులను బ్యాంకర్లు పాత బాకీల కింద జమ చేసుకోవద్దని సూచించారు. ఇప్పటివరకు జమ చేసుకున్న బ్యాంకులు తిరిగి రైతులకు ఆ డబ్బులను అందించాలని పేర్కొన్నారు. ఇదివరకే వ్యవసాయ శాఖ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి రైతుబంధు నిధులు జమ చేసుకోవద్దని కోరామని తెలిపారు. ఈ రోజు వరకు రైతుబంధుకు అర్హులయిన అందరికీ వారి ఖాతాల్లో నిధులు జమచేశామని వివరించారు.
ఆన్లైన్లో రైతు బంధు పథకాన్ని ఇలా చెక్ చేసుకోండి..
1. ముందుగా https://treasury.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
2. ఆ తర్వాత రైతు బంధు స్కీమ్ రబీ వివరాలు ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి.
3. ఆ తర్వాత సంవత్సరం, రకం, పీపీబీ నంబర్ సెలక్ట్ చేసుకోవాలి.
4. అనంతరం సబ్మిట్ ఆప్షన్ ఎంచుకోవాలి. విండో పై మీకు స్టేటస్ ఆప్షన్ కనిపిస్తుంది.
5. ఆ తర్వాత డ్రాప్ డౌన్ జాబితాలో స్కీమ్ వైస్ రిపోర్ట్ పై క్లిక్ చేయండి.
6. ఆ తర్వాత మీ పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి.
7. అనంతరం మీ సంవత్సరాన్ని ఎంచుకోవాలి.
8. మీ పీపీబీ నంబర్ ఎంటర్ చేయాలి.
9. అనంతరం సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.