
ఉదయం కోడికూతతో తెల్లారే పల్లెల్లో కిలకిల మంటూ చిన్నారి పిచుకలు మురిపాలు కురిపించేవి. ఇంటి ముందర కట్టే వరిగొలుకలు తింటూ సంగీతాన్ని వినిపించేవి. ఇక అడవుల జిల్లా ఆదిలాబాద్ లో అయితే ఆ స్వరాగాల రమణీయత మరింత అందంగా ఉండేది. కానీ ఎప్పుడు అదంతా గతం అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. కిలకిలమంటూ వినిపించే ఆ చిట్టి గొంతుకలు ఇప్పుడు విన్పించడం లేదు. పచ్చని పొలాల్లో స్వచ్ఛమైన వాతావరణంలో అంతే స్వచ్చంగా వినిపించే ఆ కిలకిలరావలా ఉనికే ఇప్పుడు కనుమరుగవుతోంది. రోజురోజుకూ వాతావరణంలో వస్తున్న పెను మార్పులతో చిన్నారి పిచుకలు కనుమరుగవుతున్నాయి.
టెక్నాలజీ దెబ్బకు భూమిపై జీవజాతుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఊర పిచ్చుకల జాతి అంతరించుకుపోతోంది. పొలాల్లో రసాయన ఎరువులు, గ్రామాలూ పట్టణాలు అన్న తేడాలేకుండా పెరుగుతున్న రేడియేషన్ ప్రబావంతో ఇప్పటికే ఎన్నో పక్షి జాతులు కనుమరుగయ్యాయి. పంటల కోసం విచ్చల విడిగా వినియోగిస్తున్న ఎరువుల ప్రభావంతో పక్షిజాతులైన రాబంధులు, గద్దలు, పాలపిట్టలు, చిలకలు, గోరింకలు కనిపించకుండా పోతున్నాయి.
అడవుల జిల్లా ఆదిలాబాద్ నుండి మొదలు సింగరేణి ప్రాంతం మంచిర్యాల వరకు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే కొండలు, గుట్టలు కనుమరుగవుతున్నాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లా ఎడారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన గుట్టలన్నీ కాలగర్భంలో కలిసిపోగా.. కలప స్మగ్లర్లు, భూ బకాసురులు దెబ్బకు చెట్లు , గుట్టలు మాయమవుతున్నాయి. . ఫలితంగా అడవి జంతువులు ఆవాసాలను కోల్పోతున్నాయి . వనంలోని ఎలుగుబంట్లు, తోడేళ్లు, జింకలు, పక్షులు ఆవాసం దొరక్క అడవుల ను వీడుతున్నాయి.
మరో వైపు పల్లెల్లో సాగు కొత్త పుంతలు తొక్కడంతో.. వ్యవసాయానికి వాడే రసాయన ఎరువులు వల్ల జంతువులు, పక్షులు పెద్ద ఎత్తున చనిపోతున్నాయి. పంటలు బాగా పండాలని రైతులు వాడే రసాయనాలతో పక్షులు ఆ పంటలను తిని తనువుచాలిస్తున్నాయి. వీటికి తోడు సెల్ టవర్లు.. భూమి మీద సెల్ లేని ఊరే కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు . సెల్ టవర్ల వినియోగంతో రేడియేషన్ వి పరీతంగా పెరిగి అసలు పక్షులే కనిపించకుండా పోతున్నాయి.
ఇది ఇలాగే కొనసాగితే గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చి పక్షులే కాదు మనుసులు కూడా అంతరించి పోవడం ఖాయం అంటున్నారు పర్యావరణ నిపుణులు. ఇప్పటికైనా పర్యావరణాన్ని కాపాడుకుందాం పక్షులను రక్షించుకుందాం. పశుపక్షులు ఉంటేనే ప్రకృతి’పదికాలాల పాటుగా పచ్చగా ఉండేది లేదంటే ఇక మిగిలేది బూడిదే అంత.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..