TRS: టీఆర్‌ఎస్‌లో నివురుగప్పిన నిప్పులా వర్గ విభేదాలు.. రాజీ కుదిర్చిన ఆగని తాజా, మాజీ మేయర్ల లడాయి
తెలంగాణలో అధికార పార్టీకి అది కీలక అడ్డ. అలాంటి చోట.. నేతల మధ్య కీచులాట ఇప్పుడు తలనొప్పిగా మారింది.
Karimnagar TRS Differences: తెలంగాణలో అధికార పార్టీకి అది కీలక అడ్డ. అలాంటి చోట.. నేతల మధ్య కీచులాట ఇప్పుడు తలనొప్పిగా మారింది. అరె!! పెద్దసారు పిలిచి మాట్లాడినా.. నాయకుల మధ్య సఖ్యత కుదరడం లేదంట. సొంత పార్టీనేతల పరస్పర ఆరోపణలు.. ప్రతిపక్షానికి ఆయుధంగా మారాయి. ఇంతకీ ఆ గొడవ జరుగుతోందెక్కడ? అసలు రచ్చకు కారణమేంటి?
కరీంనగర్ టీఆర్‌ఎస్‌లో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు.. ఇప్పుడు రోడ్డున పడ్డాయి. మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. మొన్నటి వరకూ అంతర్గతంగా ఉన్న ఈ ఇద్దరు నేతల విభేదాలు.. ఒక్కసారిగా బహిర్గతం కావడం పార్టీ వర్గాల్ని కలవరపెడుతోంది. రెండోసారి రవీందర్ సింగ్‌కు మేయర్ పదవి లభిస్తుందని అంతా భావించినా.. చివరి నిమిషంలో సునీల్ రావును పేరును ఖరారు చేసింది గులాబీ హైకమాండ్. పదవి దక్కని కోపంతో.. కొంతకాలం ముఖ్య నేతలకు దూరంగా జరిగారు రవీందర్ సింగ్. ఆ తర్వాత మెల్లమెల్లగా రాజకీయాల్లో దూకుడు పెంచారు. ఏకంగా మేయర్ పైనే అవినీతి ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. అయితే ఆ ఆరోపణల్ని కొట్టిపారేశారు సునీల్‌రావు. దీంతో, మేయర్ వర్సెస్ మాజీ మేయర్ అన్నట్టుగా మారింది కరీంనగర్ పాలిటిక్స్ పరిస్థితి.
ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ టికెట్ తనకే ఇవ్వాలని రవీందర్ సింగ్.. గులాబీ అధినాయకత్వాన్ని కోరారు. అయితే, హైకమాండ్ ఒప్పుకోకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు.. టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు రవీందర్ సింగ్. మళ్లీ గులాబీ గూటికి దగ్గరైన రవీందర్.. తాజాగా మేయర్ సునీల్ రావ్‌ను టార్గెట్ చేశారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. అయితే.. దమ్ముంటే ఆధారాలు చూపాలంటూ సునీల్ రావ్ సవాల్ విసరడంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. దీంతో రవీందర్ సింగ్‌ను పిలిపించి మాట్లాడిన కేసీఆర్.. గొడవలొద్దంటూ సర్ది చెప్పారు. దీంతో సైలెంటైన మాజీ మేయర్.. పార్టీ కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొంటున్నారు.
ఇటీవల ఇద్దరు నేతల మధ్య మళ్లీ కయ్యం మొదలైంది. తాగునీటి మోటర్ల విషయమై మునిసిపల్ కార్పొరేషన్ సర్వ సభ్య సమావేశంలో.. గొడవ జరిగింది. కొన్ని ప్రాంతాలకు ఇంకా తాగు నీరు రావడం లేదనీ.. మోటార్ల విషయంలో కమీషన్లు లేనిదే పని జరగడం లేదని ఆరోపించారు రవీందర్ సింగ్. దీనికి స్ట్రాంగ్‌గా బదులిచ్చిన మేయర్ సునీల్‌రావు.. నీ సంగతీ, నీ అవినీతి సంగతీ.. అంతా తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లడాయి మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేతలు.. మీటింగ్ హాల్‌లో ఊగిపోయారు. సమావేశమంతా గందరగోళంగా మారింది. అధికార పార్టీ కార్పొరేటర్లు.. సునీల్ రావుకు మద్దతు ప్రకటించినప్పటికీ.. సొంత పక్షం నుంచి అవినీతి ఆరోపణలు రావడంతో ప్రతిపక్షానికి ఆయుదం దొరికినట్టయ్యింది. దీంతో, ఈ ఇద్దరి అవినీతి ఆరోపణలపై.. విచారణ జరిపించాలంటూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఓసారి అధినేత దాకా వెళ్లిన మేయర్, మాజీ మేయర్‌ల వ్యవహారం.. ఇప్పుడు మరోసారి అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. కీలకమైన కరీంనగర్ అడ్డాలో.. ఈ విధమైన పరిస్థితులు తలెత్తడం మంచిది కాదని పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. మరీ హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి.
— సంపత్, టీవీ 9 తెలుగు ప్రతినిధి, కరీంనగర్.
Read Also… AP: పోలీసులని చూడగానే కారు వదిలేసి ఎస్కేప్.. అసలు ఏంది కథ అని వాహనం చెక్ చేయగా..