ఇందూరు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మూడు ప్రధానపార్టీ అభ్యర్థుల పేర్లని ఖరారు చేసారు. అయితే బీజేపి అభ్యర్థి అర్వింద్, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. అంతే కాకుండా హిందుత్వ సెంటిమెంట్‌ను మరోసారి తెరపైకి తీసుకువచ్చారు అర్వింద్. నేను అన్ని మతాలని గౌరవిస్తానని జీవన్ రెడ్డి చెబుతున్నారు. అర్వింద్ మాత్రం ఒకడుగు ముందుకు వేసి జీవన్ రెడ్డి పైన సంచలన కామెంట్స్ చేసారు. ఇందూరులో ఎలాంటి రాజకీయం నడుస్తుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
నిజామాబాద్ పార్లమెంట్లో అప్పుడే ఎన్నికల వేడి మొదలయ్యింది. బీజేపి నుండి సిట్టింగ్ ఎంపి అర్వింద్, కాంగ్రెస్ నుండి అ పార్టీ సినియర్ నేత జీవన్ రెడ్డి, బిఅర్ఎస్ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలోకి దిగుతున్నారు. అయితే అర్వింద్, జీవన్ రెడ్డిల మధ్యే రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు ఏ చిన్న అవకాశాన్ని కూడ వదిలిపెట్టడం లేదు. అర్వింద్ వ్యూహాత్మకంగానే హిందుత్వ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఎనిమిది నెలల క్రితం జీవన్ రెడ్డి 370 అర్టికల్కి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్నికల ముందు ఈ వీడియో వైరల్ కావడంతో బిజేపి నేతలే ఈ రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. జగిత్యాలలో జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డిని రోహ్యింగాలతో పాటు బంగ్లాదేశ్ ముస్లీం అభ్యర్థి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. తాను మాత్రం హిందు అభ్యర్థిని, మోడి సేనగా చెప్పుకొచ్చారు. అయితే అర్వింద్ మాత్రం ఈ ఎన్నికల్లో పూర్తిగా హిందుత్వ వాదంతోనే వెళ్ళేందుకు సిద్దమయ్యారు. హిందూ ఓట్లని అకర్షించడానికి జీవన్ రెడ్డిపైన ఇలాంటి వ్యాఖ్యలు చేసారన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది.
ఈ సెగ్మెంట్లో హిందుత్వం ఎంత బలంగా ఉంటుందో, ముస్లీం సామాజికవర్గ ఓట్లు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. జీవన్ రెడ్డికి మైనారిటీలతో మంచి బంధం ఉంది. ప్రతి ఎన్నికలలో అధికశాతం మైనారిటిలు జీవన్ రెడ్డి కి ఓటు వేస్తున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో జగిత్యాల, కొరుట్ల, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్‌లో గణనీయంగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. గెలుపు ఓటములపై మైనారిటీలు ప్రభావం చూపనున్నారు. జీవన్ రెడ్డి ప్లాన్ ప్రకారం మైనారిటీలతో సమావేశం నిర్వహిస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికలలో అధికంగా మైనారిటీలు బిఅర్ఎస్కి ఓటు వేసారు. ఇప్పుడు ఓట్లు చీలకుండా మైనారిటీల ఓట్లు కాంగ్రెస్ కి వచ్చే విధంగా జీవన్ రెడ్డి వ్యూహం రూపొందిస్తున్నారు. ఇది పసిగట్టిన అర్వింద్ హిందూత్వ సెంటిమెంట్‌ని ముందుకు తీసుకు వస్తూ లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ ఇద్దరు నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో ఇందూరు రాజకీయాలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..