తెలంగాణలో మిల్లర్ల నుంచి FCI బియ్యం సేకరణ ఆపేయడంపై రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే బియ్యం సేకరణ ఆగిందని పేర్కొంది. కేంద్రం నుంచి వచ్చే అన్న యోజన పథకం బియ్యం పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అందుకే బియ్యాన్ని సెంట్రల్ పూల్‌లోకి సేకరించడాన్ని FCI నిలిపేసిందని స్పష్టం చేసింది. ఆ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే సృష్టించిందని ఆ ప్రకటనలో పేర్కొంది. బియ్యం సేకరణలో అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలోనూ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని పేర్కొంది. 40 మిల్లుల్లో నాలుగు లక్షల 53 వేల 896 బియ్యం సంచులు మాయమైనట్లు గుర్తించామని స్పష్టం చేసింది. డిఫాల్టయిన మిల్లర్ల జాబితాను మార్చి 31నే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని, అయినా చర్యలు లేవని తప్పుబట్టింది.
మళ్లీ మే 21న 63 మిల్లుల్లో లక్షా 37 వేల 872 బియ్యం సంచులు మాయమయ్యాయని కేంద్రం సంస్థ ప్రకటించింది. 593 మిల్లుల్లో లెక్కించడానికి వీల్లేకుండా ధాన్యం సంచులను నిల్వచేశారని, లోపాలను సరిదిద్దుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేకపోయిందని చెప్పింది కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది.
అన్న యోజన పథకం కింద ఏప్రిల్-మే కోటా కింద కోటీ 90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని, కానీ ఆ బియ్యాన్ని లబ్దిదారులకు అందకుండా చేసిందని తప్పుబట్టింది. ఈ కారణంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరణను నిలిపేయాల్సి వచ్చిందని ప్రకటించింది. వీటిపై యాక్షన్ టేకెన్ రిపోర్టును తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం FCIకి అందజేయాలని, అప్పుడే సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరణ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ప్రకటించింది.