Telangana: రిసార్ట్‌లో వ్యక్తి ప్రాణాలు తీసిన డేంజర్‌ గేమ్‌.. వికారాబాద్‌లో వెలుగులోకి ఘటన

డేంజర్‌ గేమ్‌ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. దాచి పెట్టిన వస్తువును కనిపెట్టడమే గేమ్‌ టాస్క్‌. బావిలో వస్తువును దాచిపెట్టారు రిసార్ట్స్‌ నిర్వాహకులు. దాని కోసం ఆ బావిలోకి దూకాడు సాయికుమార్.

Telangana: రిసార్ట్‌లో వ్యక్తి ప్రాణాలు తీసిన డేంజర్‌ గేమ్‌.. వికారాబాద్‌లో వెలుగులోకి ఘటన
Deceased Sai Kumar

Updated on: Oct 30, 2022 | 12:54 PM

వీకెండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌కు కేరాఫ్‌గా నిలిచే రిసార్టులు.. రిస్కీ స్పాట్‌లుగా మారుతున్నాయ్‌. అవును, హైదరాబాద్‌ శివార్లలోని రిసార్ట్స్‌లో డేంజర్‌ గేమ్స్‌… జనాల ప్రాణాలు తీస్తున్నాయ్‌. వికారాబాద్ సమీపంలోని ఓ రిసార్ట్స్ నిర్వాహకులు నిర్వహించిన డేంజర్ గేమ్‌లో వ్యక్తి మృతిచెందడం కలకలం రేపుతోంది. ఎక్కడో కనిపించకుండా దాచిపెట్టిన వస్తువుని కనిపెట్టడమే ఈ గేమ్‌ టార్గెట్‌. శనివారం సాయంత్రం గోధుమగూడలోని మూన్ లైట్ రిసార్ట్స్ కి చేరుకున్నారు కొందరు హైదరాబాద్ యువకులు. రిసార్ట్స్‌ వాళ్లు ప్లాన్‌ చేసిన ఈ డేంజర్‌లో పార్టిసిపేట్‌ చేశారు. అయితే, రిసార్ట్స్ నిర్వాహకులు ఓ వస్తువును బావిలో దాచిపెట్టారు. దాన్ని కనిపెట్టేందుకు బావిలో దూకిన వ్యక్తి… శవమై బయటకు తేలడంతో.. జాలీ ట్రిప్‌ కాస్తా ట్రాజెడీగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. బావిలోంచి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం.. వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ మూన్ లైట్ ప్రోగ్రాం జరుగుతోంది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి వంద మందికి పైగా యువకులు రిసార్ట్స్‌కి చేరుకున్నారు. గేమ్‌లో భాగంగా… దాచిపెట్టిన వస్తువును కనిపెట్టేందుకు బావిలో దూకిన సాయి కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే సాయికుమార్‌కు ఇటీవలే ఓ బాబు పుట్టినట్టు.. అతని స్నేహితులు చెబుతున్నారు.

ఈ ఉదంతంతో… పుట్టగొడుగుల్లా విస్తరించిన రిసార్ట్స్‌ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. అనుమతి లేకుండా ఈ హైదరాబాద్ అడ్వెంచర్‌ క్లబ్‌ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..