
Suryapet, July 15: అతనో డాన్స్ మాస్టర్. ఎంతోమంది చిన్నారులకు డాన్స్ నేర్పించిన గురువు. ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. అయితే, జీవితంలో పెళ్లి చేసుకోవాలనే కల తీరక పోవడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండకు చెందిన దారా సురేష్ డ్యాన్స్ మాస్టర్‌గా గుర్తింపు పొందాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో ఇద్దరు అన్నల సంరక్షణలో పెరిగాడు.
చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే మక్కువతో హైదరాబాద్ లోని ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ల వద్ద డాన్స్‌లో శిక్షణ పొంది మాస్టర్‌గా మారాడు. అయితే, సురేష్ కోదాడ, కొమరబండలలో ఉంటూ స్థానికంగా చిన్నారులకు డ్యాన్స్‌లో శిక్షణ ఇస్తుండేవాడు. కోదాడ ప్రాంతంలో జరిగే ప్రతి పండుగల్లో డాన్స్ ప్రదర్శనలు ఇస్తుండేవాడు. ఇంతవరకు బాగానే ఉన్నా… జీవితంలో పెళ్లి చేసుకొని స్థిరపడాలనుకున్నాడు. పెళ్లి సంబంధాలు రాకపోవడంతో మద్యానికి బానిస అయ్యాడు. పెళ్లి కాలేదని మనస్థాపనతో డాన్స్ మాస్టర్ సురేష్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సురేష్ సోదరుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..