
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే హత్య చేయించింది భార్య. ఇందుకు ప్రియుడు, మరో ముగ్గురి సహకారం అందించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేటీదొడ్డి మండల కేంద్రంలో ఘటన చోటు చేసుకుంది. సీన్ కట్ చేస్తే హత్య బాగోతం ఉపాధి కూలీల పనుల్లో వెలుగులోకి వచ్చింది.
మల్దకల్ మండలం మద్దెలబండకు చెందిన కుర్వ నర్సింహులుకు కేటీదొడ్డి మండలంలోని గంగన్‌పల్లికి చెందిన పద్మతో పన్నేండళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు సంతానం. మొదట్లో వీరి సంసారం సాఫీగానే సాగినా.. గడిచిన కొన్నాళ్ల క్రితం భార్య, భర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో అప్పటి నుంచి భార్య పద్మ పుట్టింటి వద్దే ఉంటోంది. పెద్దల సమక్షంలో పంచాయితీ జరుగుతోంది. అయితే నర్సింహులు అప్పుడప్పుడు భార్యను చూసేందుకు గంగన్ పల్లికి వస్తుండేవాడు. ఈ క్రమంలో వరుసకు మామ అయ్యే కుర్వ అంజలప్పతో భార్య పద్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం నర్సింహులుకు తెలిసింది. దీంతో భర్త అడ్డును శాశ్వతంగా తొలగించేందుకు, ప్రియుడు అంజలప్పతో కలిసి ప్లాన్ రచించింది. ఇందుకోసం గట్టు మండలం బస్సాపూర్ కు చెందిన గుంత గోవిందుతో రూ.1.50లక్షలకు నర్సింహులు హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 17వ తేదిన నర్సింహులును హత్యకు పూనుకున్నారు. ఇందుకోసం నర్సింహులుతో పాటు అంజలప్ప, గోవింద్ కలిసి అదే రోజు రాత్రి మద్యం కొనుగోలు చేసి బైక్ పై కేటీ దొడ్డి శివారుకు వెళ్లారు. అక్కడే ముగ్గురు మద్యం సేవించారు. నర్సింహులుకు అధిక మోతాదులో మద్యం తాగించారు. తర్వాత గోవిందు సహచరుడు గుంత అంజనేయులు అక్కడికి రప్పించారు. మొత్తం ముగ్గురు నిందితులు కలిసి మత్తులో ఉన్న నర్సింహులును హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గుంతతీసి పూడ్చి అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ నెల 19న కేటీదొడ్డి శివారులోని ఉపాధి కూలీలు ఇంకుడు గుంతలు తవ్వుతుండగా దుర్వాసన రావడంతో పరిశీలించగా మృతదేహం బయటపడింది. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ్ గౌడ్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహం ఎవరిదని ఆరా తీయగా… నర్సింహులుగా గుర్తించారు. అనంతరం నర్సింహులు భార్య పద్మను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితులు మైలగడ్డ స్టేజీ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, బైక్, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పద్మతో సహా ముగ్గురిని కోర్టులో హాజరుపరిచి… రిమాండ్ కు తరలించారు.