Cyberabad Police: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి.. మందుబాబుల మత్తు వదిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన మందుబాబులకు అడ్డంగా బుక్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 353 మంది మందుబాబులను పట్టుకున్న పోలీసులు.. వారిని కోర్టులో ప్రవేశపెట్టారు.
కేసును పరిశీలించిన కోర్టు.. 353 మంది మందుబాబులకు 20 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కూకట్‌పల్లి ట్రాఫిక్ పీఎస్‌లో 79, మాదాపూర్-41, బాలానగర్-49, రాజేంద్రనగర్-30, శంషాబాద్-24, గచ్చిబౌలి-50, మియాపూర్-60 మంది చొప్పున మందుబాబులకు జైలు శిక్ష పడింది. అంతేకాదు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన వీరికి జైలు శిక్షతో పాటు.. అదనపు గిఫ్ట్‌గా వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయించాలని పోలీసులు నిర్ణయించారు. ఆ మేరకు ఆర్టీఓ అధికారులకు పోలీసులు లేఖ రాశారు.