కాయిన్స్ వేటలో కంత్రీ సార్లు.. కోట్ల ఆశలతో యూబిట్ ఊబిలో సామాన్యులు గిలగిలా..!

| Edited By: Balaraju Goud

Sep 08, 2024 | 3:33 PM

క్లాసులు చెప్పాల్సిన సార్లు.. కాసుల కోసం దారి తప్పుతున్నారు. కాయిన్స్ వేటలో పడి తమ వృత్తికే కళంకం తెస్తున్నారు. ఒకటికి పది.. పదికి వంద అన్న తీరున.. లక్షకు.. పది లక్షలు.. పది లక్షలకు కోటి రూపాయలంటూ ఆశ చూపుతూ యూబిట్ ఊబిలోకి దించుతున్నారు.

కాయిన్స్ వేటలో కంత్రీ సార్లు.. కోట్ల ఆశలతో యూబిట్ ఊబిలో సామాన్యులు గిలగిలా..!
Ubit
Follow us on

క్లాసులు చెప్పాల్సిన సార్లు.. కాసుల కోసం దారి తప్పుతున్నారు. కాయిన్స్ వేటలో పడి తమ వృత్తికే కళంకం తెస్తున్నారు. ఒకటికి పది.. పదికి వంద అన్న తీరున.. లక్షకు.. పది లక్షలు.. పది లక్షలకు కోటి రూపాయలంటూ ఆశ చూపుతూ యూబిట్ ఊబిలోకి దించుతున్నారు. చెప్పినట్టుగానే లక్ష పెడితే పది లక్షలు.. పది లక్షలు పెడితే కోటీ నెల రోజుల్లోనే కళ్ల ముందు కాసులు గలగల కనువిందు చేస్తుండటంతో తెలిసిన వారిని ఈ ఊబిలోకి లాగేస్తున్నారు. త్రీస్టార్లు.. ఫైవ్ స్టార్లు.. మీ ఊర్లో మీరే రియల్ స్టార్లు అంటూ నమ్మబలకడంతో.. ఈ దందా మూడు కాయిన్లు.. ఆరు కోట్లు అన్నట్టుగా సాగుతోంది. నిర్మల్ జిల్లాలో ఇప్పుడు ఏ మండలంలో చూసిన క్రిప్టో కరెన్సీ మాటే వినిపిస్తోంది.

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ రాజ్యమేలుతోంది. ఈ మండలం ఆ మండలం అన్న తేడా లేకుండ జిల్లా అంతటా విస్తరించి కోట్లకు పడగలెత్తుతూ సామాన్యులను నిండా ముంచేందుకు రెడీ అయింది. ఈ దందాలో కీ రోల్ అంతా ప్రభుత్వ ఉద్యోగులదే కావడంతో దందా జోరుగా సాగుతోంది. ఇప్పటికే నిర్మల్, కడెం, ఖానాపూర్, తానూర్, బైంసా , ముథోల్ మండలాల్లో యూబిట్ కాయిన్.. క్రిప్టో కరెన్సీలో భారీగా పెడ్టుబడులు పెట్టిన వ్యక్తులు.. మొదటి రెండు నెలలు దండిగా సంపాదన రిటర్న్స్ లో రావడంతో మరింత మందిని ఈ దందాలోకి లాగినట్టు తెలుస్తోంది.

చట్టబద్ధత లేని యూబిట్‌ కాయిన్‌ చైన్‌ వ్యాపారంలో కీరోల్ అంతా ప్రభుత్వ టీచర్లు , పోలీస్ సిబ్బందిదే అని తేలడంతో నిర్మల్ జిల్లాలో కలకలం రేగింది. వారం రోజుల క్రితం నేరుగా ఎస్పీ కి అందిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన నిర్మల్‌ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ప్రత్యేక చొరవ తీసుకుని ఈ యూబిట్‌ కాయిన్‌ చైన్‌దందా గుట్టును రట్టు చేశారు. ఇప్పటికే ఐదుగురు ఏజెంట్లను అరెస్టు చేయగా వారంత ప్రభుత్వ ఉద్యోగులు కావడం తో ఒత్తిడి అదే స్థాయిలో వచ్చినట్టు సమాచారం. అవేమీ పట్టించుకోకుండా ఎస్పీ జానకీ నిర్మల్ ఈ చైన్ దందా పై మరింత ఫోకస్ పెట్టినట్టు సమాచారం.

ఈ దందా లో ఇప్పటికే ఆర్మూర్‌ ఎక్సైజ్‌ ఎస్సై గంగాధర్‌, కడెం మండలంలోని నవాబ్‌పేట్‌కు చెందిన సల్ల రాజ్‌కుమార్‌, సాయికిరణ్‌తో , నిర్మల్‌కు చెందిన కండెల నరేశ్‌, గంగాధర్‌, మహేశ్‌ బిట్‌కాయిన్‌ పేరిట ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడ్డారని ఎస్పీ‌ జానకీ షర్మిల తెలిపారు. రూ. లక్ష పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.14 వేలు వస్తాయని చాలా మంది అమాయకులను దందాలోకి దించినట్టు గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు. ఇప్పటివరకు నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా రూ.50 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్టు ప్రాథమికంగా గుర్తించామని… కాయిన్ల ఆశలో వేల మంది అప్పులు చేసి మరీ ఈ దందాలో పెట్టుబడి పెట్టినట్టు తమ దృష్టికి వచ్చిందని.. ఈ బిట్ కాయిన్ దందాలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కొందరు రిపోర్టర్లు, రియాల్టర్లు, ప్రైవేట్ ఉద్యోగులు , రాజకీయ నాయకులు ఉన్నట్టుగా గా గుర్తించినట్టు తేలింది.

అరెస్ట్ అయిన నిందితుల తోపాటు మరో 40 మంది టీచర్లు ఈ దందాలో కీలక పాత్ర పోషించినట్టు పోలీసుల విచారణలో తేలింది. జిల్లాలో పెద్ద ఎత్తున కొనసాగుతున్న యూబిట్‌ కాయిన్‌ దందాపై రాష్ట్ర సైబర్‌ క్రైం పోలీసులు సైతం నిఘా పెట్టినట్లు సమాచారం. నిర్మల్‌ ఎస్పీ పంపిన నివేదిక ఆధారంగా సైబర్‌ క్రైం ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఈ దందాపై ఆరా తీసినట్టు సమాచారం. భైంసా డివిజన్ లోనే పెద్ద మొత్తంలో లావాదేవీల సాగినట్టు.. సరిహద్దు జిల్లాలకు కూడా ఈ కాయిన్ దందా పాకినట్టు తెలుస్తోంది. నిందితుల అరెస్ట్ తో అలర్ట్ అయిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు యాప్ ను డీయాక్టివేట్ చేయగా.. మరికొందరు ఫోన్లు స్విచ్ ఆప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది.

డాలర్లు పోగేయొచ్చని అమాయకులకు ఎర వేసిన ఏజెంట్లు.. నెలల వ్యవధిలో తాము కోటీశ్వరులం అయ్యామని ఆధారాలతో చూపి బురిడీ కొట్టించినట్టు తెలుస్తోంది. భారత్ లో క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ దందా అక్రమం కావడంతో.. ఈ కాయిన్ల దందాలో భాగస్వామ్యులై కోట్లు గడించిన ప్రతి ఒక్కరిని ఆధారాలతో సహా చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం నిర్మల్ జిల్లా పోలీసుల మీద ఎంతైనా ఉంది‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..