Telangana: ఎస్సైగా కొత్తగా వచ్చా.. ఆ ప్రాంతంలోని చాలామందికి కాల్స్.. కట్ చేస్తే..

సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అనేక రకాలుగా ప్రజలను బురిడీ కొట్టించి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. రోజుకో అవతారమెత్తి పలువురికి ఫోన్ల చేస్తూ వారి అకౌంట్లలోని నగదును అపహరిస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో సైబర్ మోసగాళ్లు మరో అడుగు ముందుకేసి కొత్త తరహా మోసానికి పాల్పడ్డారు.

Telangana: ఎస్సైగా కొత్తగా వచ్చా.. ఆ ప్రాంతంలోని చాలామందికి కాల్స్.. కట్ చేస్తే..
Fraud calls

Edited By: Ram Naramaneni

Updated on: May 01, 2025 | 11:38 AM

నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను.. ఉన్నతాధికారులకు అర్జెంటుగా డబ్బు అవసరం పడింది. ఫోన్ పే చేస్తే మా సిబ్బంది వచ్చి నగదు ఇస్తారని స్థానిక వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్న ఘటనలు మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, మూసాపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటు చేసుకున్నాయి. ఇటీవలే ఓ గుర్తుతెలియని వ్యక్తి తాను దేవరకద్ర ఎస్ఐ శ్రీనివాస్ అని పలు గ్రామాల్లో వ్యాపారులు, దుకాణదారులు, రాజకీయ నాయకులకు ఫోన్ చేశాడు. వారిని మాటల్లో పెట్టి తాను ఎస్సైగా కొత్తగా వచ్చానని అవసరాలకు కొంత నగదును బదిలీ చేయమని కోరాడు. కొంతమంది ఆ మాటలు నమ్మి గుడ్డిగా నగదు ట్రాన్ఫర్ చేయగా… మరికొంతమందికి అనుమానం కలగడంతో దేవరకద్ర ఎస్ఐ నాగన్నకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన పోలీసులు ఎప్పుడూ ఎవరినీ డబ్బులు అడగరని… సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.

ఇక మూసాపేట మండలం జానంపేట శివారులోని పెట్రోల్ పంపు యజమాని శివప్రసాద్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను అడ్డాకుల ఎస్ఐని మాట్లాడుతున్నాని చెప్పాడు. పెట్రోల్ పంపులో ఉన్న మేనేజర్ నెంబర్ ఇవ్వాలని కోరడంతో శివప్రసాద్ ఆ నెంబర్ ఇచ్చాడు. వెంటనే మేనేజర్ రాజేశ్‌కు కాల్ చేసిన దుండగుడు తాను ఎస్ఐని మాట్లాడుతున్నానని తనకు అత్యవసరంగా రూ.20వేలు ఫోన్ పే చేయాలని కోరాడు. నగదును మనిషితో పంపిస్తా అంటే.. లేదు ఆన్‌‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయమని చెప్పాడు. అప్పటివరకు తాను కాల్‌లోనే ఉంటానన్నాడు. ఈ వ్యవహారంపై మేనేజర్ రాజేశ్‌కు అనుమానం రావడంతో కాల్ కట్ చేసి మూసాపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఇది సైబర్ నేరగాళ్ల పనే అని నిర్ధారించారు.

గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయమని ఫోన్ చేస్తే ఎవరు రెస్పాండ్ కావద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే 1930కి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..