Cross fire with Minister KTR: వచ్చే ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సిద్ధం అవుతోంది? ఈ మధ్య రాటుదేలిన విమర్శనాస్త్రాలు దేనికి సంకేతం? నిధులు, నియామకాలు, విమర్శలు, ప్రతివిమర్శలు.. రాజీనామాల సవాళ్ల వరకు ఎందుకొచ్చాయి? బీజేపీనా.. కాంగ్రెసా? అధికార పార్టీ సమీప ప్రత్యర్థి ఎవరు? MIM స్వపక్షమా? విపక్షమా? వీటిన్నింటికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టీవీ9 క్రాస్ ఫైర్ ప్రత్యేక ఇంటర్య్వూలో సమాధానం ఇచ్చారు. అంతేకాదు, తెలంగాణ ఫ్యూచర్ సీఎం ఎవరు? మంత్రి కేటీఆర్‌కు వారసత్వమే అర్హతా? వంటి సూటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారాయన. తన భవిష్యత్ ప్రణాళికలు.. రాజకీయ లక్ష్యాలేంటో చెప్పారు.
భారత్‌లోని చిన్న రాష్ట్రమైన తెలంగాణ చైనాకంటే వేగంగా ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్ల వ్యవధిలోనే నిర్మించి చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో 60 ఏళ్లుగా ఉన్న విద్యుత్తు సమస్యను అయిదు నెలల్లోనే అధిగమించింది. ఫ్లోరైడ్ భూతాన్ని రెండేళ్లలో తరిమికొట్టి దేశానికి ఆదర్శంగా నిలిచింది. గోల్‌మాల్ గుజరాత్ నమూనా కావాలా? గోల్డెన్ తెలంగాణ కావాలా? అనే చర్చ దేశమంతటా నడుస్తోంది.
ఉద్యమ, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ అభివృద్ధిః కేటీఆర్
తెలంగాణకు స్వీయగొంతుక ఉండాలని, ప్రజల ఆకాంక్షలు సాధించాలని కేసీఆర్ తెలంగాన రాష్ట్ర సమితిని ప్రారంభించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీకి ఉద్యమ, పోరాట స్ఫూర్తి ఉగ్గుపాలతోనే వచ్చిందన్నారు. అదే పంథాను భవిష్యత్తులోనూ కొనసాగిస్తున్నామన్న మంత్రి కేటీఆర్.. 21 ఏళ్లుగా ప్రజలే కేంద్రబిందువుగా పార్టీ పనిచేస్తోందని తేల్చి చెప్పారు.
తెలంగాణ ప్రజలు కుల, మతాలకు ఎప్పుడూ వ్యతిరేకంః కేటీఆర్
ఈ మధ్య ఇరు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు.. కాస్తా శృతిమించుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ప్రత్యర్థి పార్టీలకు టీవీ9 క్రాస్ ఫైర్‌లో అనేక ప్రశ్నలు సంధించారు. తెలంగాణ ప్రజలు కుల, మతాలను ఎప్పుడూ వ్యతిరేకిస్తారన్నది కేటీఆర్ ఫార్మూలా. దేశంలో ఎక్కడ లేని విధంగా వైవిధ్యమైన చైతన్యం తెలంగాణలో ఉందన్నారు. దేశానికి అత్యధిక నిధులిచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణది నాలుగో స్థానం. ఇది తాము అంటున్నది కాదు.. RBI చెప్తున్న లెక్కలంటూ వివరించారు. తమ విధానాలు నచ్చి, సంక్షేమ పథకాలకు మెచ్చి.. పక్కనున్న బీజేపీ రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నారంటూ క్రాస్ ఫైర్‌లో వివరించారు. 8 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో మోదీ తెలంగాణకు ఏం చేశారంటే కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీకి మతం అనే భావదారిద్ర్యం తప్ప.. అజెండా లేదని స్పష్టం చేశారు. జైశ్రీరాం కేవలం బీజేపీ నినాదమా అని ప్రశ్నిస్తున్న మంత్రి.. అయోధ్య రాముడే రాముడా, భద్రాద్రి రాముడు రాముడు కాదా అంటూ కౌంటర్ విసిరారు. రాష్ట్రంలో ఎవరైనా రాజకీయం చేయవచ్చంటున్న కేటీఆర్.. ప్రత్యర్థి ఎవరంటే కాంగ్రెసే అంటారు.
అప్పులను ఉత్పాదక పెట్టుబడిగా భావించాలిః కేటీఆర్
రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. ఏ సమస్యలూ లేవు. దీంతో విపక్షాలు పనికిరాని విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడే అప్పులుచేస్తోంది. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీఎస్‌డీపీ)లో అప్పుల నిష్పత్తి కేవలం 22 శాతమే. అదే కేంద్ర ప్రభుత్వంలో 65 శాతం ఉంది. మోదీ ప్రధాని అయ్యాక రూ.132 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. అప్పును ఉత్పాదక పెట్టుబడిగా భావించాలి. తెలంగాణలో విద్యుత్తు సాగు, తాగునీటి రంగాలకు వెచ్చించడం ద్వారా సంపదను సృష్టిస్తున్నాం.
పెట్రోల్, డిజీల్ ధరలు పెంపుతో కేంద్రం దోపిడీః కేటీఆర్
2014లో ముడిచమురు గ్యాలన్ ధర 105 డాలర్లు. ఇప్పుడూ అంతే ఉంది. అప్పుడు పెట్రోలు రూ. 75. ఇప్పుడు రూ. 105. గత ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వ వ్యాట్ 35 శాతానికి మించలేదు. కానీ, కేంద్రం సెస్సుల పన్నుల రూపంలో భారీ పెంచింది. వారు డీజిల్ రేటు పెంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచవద్దంటే ఎలా? కరెంటుపై భారం పెరిగినా ఒక్కసారే ఛార్జీలు పెంచాం. కేంద్రంలో ధరలు పెంచుతూ.. రాష్ట్రంలో బీజేపీ నేతలు ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉంది.
మోదీ-ఈడీ, జుమ్లా-హమ్లా తప్ప మరో మాటే లేదుః కేటీఆర్
రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా దోపిడీ జరిగిందంటే.. ఆధారాలుంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్లు దోచుకున్నారంటే.. అవన్నీ ఎక్కడ దాచామో చూపించండి అంటూ సవాలు విసరారు. కేంద్రం చేస్తుందేమిటి దేశవ్యాప్తంగా మోదీ-ఈడీ, జుమ్లా-హమ్లా తప్ప మరో మాటే వినిపించడం లేదు. కేవలం బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లోనే ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు అని ప్రశ్నిస్తున్న కేటీఆర్.. సుజనా చౌదరి, సీఎం రమేశ్‌పై ఉన్న కేసులు ఏమయ్యాయని అని అడుగుతున్నారు. వ్యాపారులు, వ్యాపార సంస్థలపై దాడులు చేయోచ్చంటున్న మంత్రి పార్టీలు, ప్రభుత్వాల మీద దాడులు చేయలేరని అంటున్నారు. ఎలాంటి ఆధారాల్లేకుండా విపక్షాలు సొల్లు పురాణం చెబుతున్నాయి. సుజనాచౌదరి, సీఎం రమేశ్ లాంటి వారి మీద ముందు కేసులుంటాయి. బీజేపీలో చేరిన తర్వాత ఆ ఊసే లేదు.
మోదీ చెప్పేవి గాంధీ సిద్ధాంతాలు.. ఆచరించేవి గాడ్సేవిః కేటీఆర్
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చీటికిమాటికి సీఎంను జైలులో పెడతామంటున్నారు. మేం కూడా మోదీని జైలులో పెడతామని అనవచ్చు. దేశంలో 21 బీజేపీ పాలిత రాష్ట్రాలున్నాయి. అక్కడ అవినీతి లేదు. అక్కడంతా సత్యహరిశ్చంద్రులే. గుజరాత్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మోదీపై విమర్శలు చేశారని ఆయనను అరెస్టు చేశారు. నేనూ అదే అంటున్నా. మోదీ చెప్పేవి గాంధీ సిద్ధాంతాలు.. ఆచరించేవి గాడ్సేవి. నన్ను కూడా అరెస్టు చేసి జైలుకు పంపుతారా?
ప్రశ్నిస్తే జైలులో పెడతారా! – కేటీఆర్
బీజేపీ ఫ్యామిలీ పాలిటిక్స్‌కు వ్యతిరేకం అంటోంది.. కాని ఆ పార్టీయే ఫ్యామిలీ పాలిటిక్స్ నడుపుతోందంటూ వ్యక్తుల పేర్లతో సహా వివరించారు. ప్రధాని మోదీ గాంధీ మాటలు చెప్తూ.. గాడ్‌సే పనులు చేస్తారు అంటున్నారు. ఈ మాట బహిరంగంగానే అంటున్న.. జైళ్లో పెడతారా అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ గాంధీ మాటలు చెప్తారు.. గాడ్‌సే పనులు చేస్తారు. ఈ మాట అంటే తనను జైళ్లో పెడతారా అని ప్రశ్నించారు కేటీఆర్.
వీసా తీసుకుని వెళ్లాలా అని వైఎస్ అనలేదా? – మంత్రి కేటీఆర్
తెలంగాణలో ఎవరైనా రాజకీయం చేయవచ్చంటున్నారు కేటీఆర్. కాంగ్రెసే మాకు ప్రత్యర్థి అంటున్న కేటీఆర్.. కె.ఎ.పాల్ సైతం రాజకీయాలు చేసుకోవచ్చన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పార్టీలు.. కేంద్రాన్ని, మోదీని ఎందుకు నిలదీయవని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. వై.ఎస్.షర్మిల అత్త మీద కోపాన్ని దుత్త మీద తీర్చుకుంటున్నారని తనదైన శైలిలో వివరించారు. రాష్ట్ర విభజన జరిగితే.. తెలంగాణ వెళ్లడానికి వీసా తీసుకోవాలన్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న వారు వీసా తీసుకొని వస్తున్నారా అని ప్రశ్నించారు కేటీఆర్. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పాదయాత్రలతో టీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రజలు కేసీఆర్ వెంట ఉన్నంత కాలం ఎవరు టీఆర్ఎస్ సర్కార్‌కు డోకాలేదన్నారు కేటీఆర్.
మజ్లిస్‌ను పాతబస్తీకి పరిమితం చేసిన ఘటన కేసీఆర్‌దేః కేటీఆర్
MIMతో మీకు దోస్తీ ఉందా అంటే.. కుస్తీనే ఉందంటున్నారు కేటీఆర్. దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఆ పార్టీని ఓల్ట్ సిటీకి పరిమితం చేసిన ఘనత కేసీఆర్‌దని అంటున్నారు. ఈటల ఎపిసోడ్‌లో అసలేం జరిగిందంటే.. అలాంటి వారు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారంటూ కామెంట్ చేశారు. వారసత్వం అనేది అర్హత కాకూడదు, ప్రతిబంధకం కాకుడదంటున్న కేటీఆర్.. తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అనే పేరు నిలబడాలన్న తన లక్ష్యం పూర్తైందంటున్నారు. భవిష్యత్‌లో సీఎం అవుతారా అంటే రాజకీయ లక్ష్యాలేవి లేవంటూ చెప్పుకొచ్చారు. ప్రత్యర్థి ఎవరైతేనే.. ప్రజలు తమవైపు ఉన్నారంటున్నారు కేటీఆర్. గతంలో ఏ పార్టీతోనూ పొత్తులేదు, భవిష్యత్‌లోనూ ఉండబోతుందంటూ సంకేతాలిచ్చారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
సీఎం పదవిపై ఆశ లేదుః కేటీఆర్
ఆశ ఉండాలి గానీ, దురాశ ఉండొద్దు. నేను సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయ్యాను. వారికి శాశ్వతంగా రుణపడి ఉంటా. మంత్రిని అవుతాననుకోలేదు. దయతో సీఎం నాకు పదవి ఇచ్చారు. ఇప్పుడు గెలిచి తిరిగి అధికారంలోకి రావాలి. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో అవకాశం ఇస్తే మంత్రిగా ఉంటాను. లేకపోతే పార్టీ కోసం పనిచేస్తానని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణకు బీజేపీ నేతలు చేసిందేం లేదు.. కేటీఆర్
దేశంలో వైవిధ్యమైన చైతన్యం తెలంగాణలో ఉంది. దేశానికి అత్యధిక నిధులిచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణది నాలుగో స్థానం. పక్కనున్న బీజేపీ రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నారని అంటున్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. 8 ఏళ్లలో మోదీ తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీకి అజెండా లేదు, మతం అనే భావదారిద్ర్యం తప్ప. సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ, సమాజంలో తక్కువ అని విమర్శించారు మంత్రి కేటీఆర్.
భద్రాద్రి రాముడు రాముడు కాదాః కేటీఆర్
అయోధ్య రాముడే రాముడా, భద్రాద్రి రాముడు రాముడు కాదా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. బీజేపీ వాళ్లు భద్రాద్రి రాముడికి ఎన్ని నోట్ల కట్టలు ఇచ్చారు. జైశ్రీరాం.. ఎవరి నినాదం, బీజేపీ నినాదమా అని ప్రశ్నించారు.