ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది.. వర్షాలు కురుస్తుండటంతో జోరుగా వ్యవసాయ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ రైతు పొలంలో కలుపు తీయడానికి వెళ్లిన కూలీలకు అనుకోని అతిథి కనిపించింది.. దూరం నుంచి కదులుతున్న ఓ ఆకారాన్ని చూసి ఒక్కసారిగా పరుగులు తీశారు.. పత్తి చేనులో మొసలి కనిపించిన ఈ షాకింగ్ ఘటన గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.. అసలేం జరిగిందంటే.. మల్దకల్ మండల కేంద్రానికి చెందిన సవారన్న పొలంలో పత్తి సాగు చేస్తున్నాడు.. పత్తిపంటలో కలుపు తీసేందుకు కూలీలను రప్పించాడు.. కూలీలంతా కలుపు తీస్తుండగా.. శుక్రవారం ఉదయం మొసలి కనబడింది. దీంతో భయాందోళనకు గురైన కూలీలు పంట యజమానికి సమాచారం అందించారు. దీంతో సవారన్న పోలీసులకు ఈ విషయాన్ని చెప్పాడు.. అక్కడికి చేరుకున్న పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.
అటు పోలీసులు.. ఇటు ఫారెస్ట్ సిబ్బంది స్థానికుల సహాయంతో మొసలిని పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా.. అది సమీపంలోని బావిలోకి దూకింది. దీంతో ఐదుగంటల పాటు శ్రమించి మోటర్ల ద్వారా నీటిని బయటకు తీశారు.. అనంతరం తాళ్ల సాయంతో మొసలిని బయటకు తీశారు. అనంతరం దానికి బంధించి ఆటోలో తరలించి గద్వాల సమీపంలోని జూరాల ప్రాజెక్టులో వదిలేశారు. అందరినీ పరుగులు పెట్టించిన మొసలి ఎట్టకేలకు పట్టుబడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మొసలి బరువు సుమారు రెండు క్వింటాళ్లు ఉంటుందని అటవీ అధికారులు పేర్కొన్నారు.
కాగా, సమీపంలో దేవర చెరువులో మొసలి ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు.
ఇటీవల వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం జానంపేటలో కూడా ఓ మొసలి ఇంట్లోకి మొసలి చొరబడిన విషయం తెలిసిందే.. గ్రామ సమీపంలోని రామసముద్రం చెరువు నుంచి భారీ మొసలి బయటకు రాగా.. వీధి కుక్కలు వెంట పడటంతో సమీపంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించింది.. ఆ తర్వాత రెస్క్యూ చేసి దానిని నదిలో వదిలిపెట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..