Telangana: కామ్రేడ్ల ఆశలు ఫలించేనా.. ఆ పార్లమెంట్ సీటుపై సీపీఐ కన్ను..! పోటీలో జాతీయ నేత

| Edited By: Shaik Madar Saheb

Dec 18, 2023 | 5:46 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తుతో అసెంబ్లీలో అడుగుపెట్టింది వామపక్ష సీపీఐ పార్టీ. అదే జోష్‌తో లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణ నుంచి పోటీ చేసి మరో అడుగు ముందుకెయ్యాలనుకుంటోంది సీపీఐ. హస్తంతో దోస్తీతోనే లోక్‌సభ ఎన్నికల్లో ఓ సీట్లో పోటీ చేయబోతున్నామని కన్‌ఫం చేశారు పార్టీ సీనియర్‌ కామ్రేడ్‌. ఇంతకీ లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీ లెగ్‌ ఎక్కడ పెట్టబోతోంది? సీపీఐ నుంచి పోటీచేసేదెవరు? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

Telangana: కామ్రేడ్ల ఆశలు ఫలించేనా.. ఆ పార్లమెంట్ సీటుపై సీపీఐ కన్ను..! పోటీలో జాతీయ నేత
Kunamneni Sambasiva Rao - Narayana
Follow us on

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తుతో అసెంబ్లీలో అడుగుపెట్టింది వామపక్ష సీపీఐ పార్టీ. అదే జోష్‌తో లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణ నుంచి పోటీ చేసి మరో అడుగు ముందుకెయ్యాలనుకుంటోంది సీపీఐ. హస్తంతో దోస్తీతోనే లోక్‌సభ ఎన్నికల్లో ఓ సీట్లో పోటీ చేయబోతున్నామని కన్‌ఫం చేశారు పార్టీ సీనియర్‌ కామ్రేడ్‌. ఇంతకీ లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీ లెగ్‌ ఎక్కడ పెట్టబోతోంది? సీపీఐ నుంచి పోటీచేసేదెవరు? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి బరిలో దిగిన సీపీఐ పార్టీ.. ఒక్క స్థానంలో గెలిచి సత్తా చాటింది. కొత్తగూడెం నుంచి పోటీచేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. ఇప్పడు అదే ఊపుతో రానున్న లోక్ సభ ఎన్నికల్లోనూ ఒక సీటులో పోటీ చేయాలని భావిస్తోంది. తాము తెలంగాణలో ఒక చోట బరిలో ఉండబోతున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తమను కలుపుకోని పోవడంతోనే ఇక్కడ అధికారంలోకి వచ్చిందని.. ఐదు రాష్ట్రాల్లో తమను కలుపుకోకుండా వెళ్లడంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ లలో ఓడిపోయిందని నారాయణ పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలు.. ఇతర పార్టీలను కలుపుకోని వెళ్లాలని నారాయణ కాంగ్రెస్ కు సూచించారు.

అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వామపక్షాలకు కొంచెం గట్టిగానే ప్రాబల్యం ఉంది.. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్ధిగా పోటిచేసిన కూనంనేని సాంబశివరావు.. కాంగ్రెస్ మద్దతుతో గెలిచారు. ఇప్పుడు లోక్ సభ సీటు విషయంలోనూ ఖమ్మం జిల్లా నుంచే ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. సీమాంధ్ర నాయకుడిగా నారాయణను చూడటం, స్థానికుడు కాదన్న ముద్ర ఉండటం, ఓట్లు బదలాయింపు జరగకపోవడం.. ఇలా అనే కారణలతో ఆయన ఓటమిపాలయ్యారు. అప్పుడు కూడా కాంగ్రెస్ తో పొత్తులో భాగంగానే సీపీఐ ఖమ్మం నుంచి పోటీ చేసింది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు ఫలించడం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ సారి విజయావకాశలు ఎక్కువ అని లెప్ట్ పార్టీలు భావిస్తున్నాయి.

ఇక లెఫ్ట్ నుంచి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఒక సీటు ఖాయమని స్వయంగా సీపీఐ నారాయణే ప్రకటించారు. దీంతో ఆయన ఖమ్మం సీటుపైనే గురిపెట్టారని.. మళ్లీ బరిలో ఆయనే దిగబోతున్నట్లు వామపక్ష వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణతో పాటు ఏపీలనూ ఒక సీట్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసే ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పొత్తు సమయంలో ఒక సీటు, రెండు ఎమ్మెల్సీలను సీపీఐకి కాంగ్రెస్ ఆఫర్ చేసింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి మరోస్థానం తర్వాత ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ కమ్యూనిస్టులను పరిగణలోకి తీసుకుంటారా..? లేదా..? అన్నది వేచి చూడాలి. సీపీఐ మాత్రం అందివచ్చిన అవకాశాన్ని తీసుకొని పార్లమెంట్ లోనూ అడుగుపెట్టాలని భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..