Covishield Vaccine: తెలంగాణలో వ్యాక్సిన్ల కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తెలంగాణకు 3లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఈ వ్యాక్సిన్‌ను కోఠిలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలిస్తున్నారు. టీకా కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారి వివరాల వారీగా ఆయా జిల్లాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో టీకా వేసుకోవడం ఉత్తమమని నిపుణులు చూపిస్తుండటంతో వ్యాక్సిన్ వేసుకునేందుకు జనం ముందుకొస్తున్నారు. దీంతో కొరత వేధిస్తుండటంతో.. అనేకమంది టీకా కేంద్రాలకు వచ్చి వెనుదిరగాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మరికొన్ని చోట్ల వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం రోజూ లక్ష నుంచి లక్షన్నర వరకూ టీకాలు వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో ఈ రోజు వచ్చిన టీకా డోసులు కేవలం రెండు రోజులకు మాత్రమే సరిపోయే అవకాశం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణకు 46.53లక్షల డోసులు అందాయి. రాష్ట్రవ్యాప్తంగా 45.36 లక్షల డోసులు వినియోగించారు. మరోవైపు మే1 నుంచి ప్రారంభం కానున్న 18 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ కొత్త అలస్యం అయ్యేలా కనిపిస్తుంది.