జల్సాలకు అలవాటు పడ్డారు.. పరిచయమున్న ఎనిమిది మంది ముఠాగా ఏర్పడ్డారు. ఈజీగా డబ్బులు సంపాదించుకోవడం కోసం అడ్డదారులు తొక్కాలని పథకం వేశారు. అమాయక రైతులనే టార్గెట్ చేశారు. ఇంకేముంది.. బ్యాంక్ అధికారులుగా అవతారమేత్తి.. రైతులను బురిడీ కొట్టించారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.
నల్లగొండ జిల్లాకు చెందిన కట్టేబోయిన పరమేష్, మమ్ముల జ్యోతి స్వరూప్, కొండా శ్రీను, గోగుల సురేశ్, చిలుముల సైదులు, పల్లెబోయిన నాగరాజు, ముప్పిడి సైదులు, షేక్ వజీర్‌లు ముఠాగా ఏర్పడ్డారు. ఈజీ మనీ కోసం రైతులే టార్గెట్2గా ఓ పథకం వేశారు. ముఠాలోని సభ్యులు కొందరు బ్యాంకు అధికారులు, మరికొందరు ఫీల్డ్ ఆఫీసర్లు, ఇంకొందరు రుణాలు ఇప్పించే దళారులుగాఅవతారమెత్తారు. నకిలీ బ్యాంక్ అధికారులుగా చెలామణి అవుతూ రైతులు, వ్యాపారస్తుల వద్దకు వెళ్లి వారి భూములను తనఖాగా పెట్టుకొని తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంక్ నుంచి ఎక్కువ మొత్తంలో రుణాలు ఇప్పిస్తామని నమ్మ బలికారు. ఈ ముఠా జిల్లాలో కొంతకాలంగా నకిలీ బ్యాంక్ అధికారులుగా చెలామణి అవుతూ రైతులను మోసగిస్తోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెద్దవూర, తిరుమలగిరి (ఎస్), నిడమానూర్, నేరేడుగొమ్ము, దేవరకొండ, పీఏ పల్లి మండలాల్లోని అమాయక రైతుల నుంచి రుణాలు ఇచ్చేందుకు ముందుగా రైతుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. 28 మంది రైతులను, వ్యాపారస్తులను మోసగించి మొత్తం రూ. 26 లక్షలు వసూలు చేశారు. ఈ ముఠా.. తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామంటూ రైతుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాలు, అగ్రిమెంట్లు చేసుకుంది.
హాలియా మండలంలోని ఓ వ్యాపారికి సోషల్ వెల్ఫర్ డిపార్ట్మెంట్ నుంచి అధిక మొత్తంలో లోన్ ఇప్పిస్తామని నమ్మించి.. కొంత డబ్బు తీసుకున్నారు. అయినా లోన్ రాకపోవడంతో ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు పెద్దవూర వద్ద ఈ ముఠా పట్టుబడింది. తీగలాగితే డొంక కదిలిన చందంగా.. నకిలీ బ్యాంక్ అధికారుల బాగోతం బట్ట బయలైంది. ముఠాలోని ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని, షేక్ వజీర్ పరారీలో ఉన్నాడని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 1,25,000 నగదు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. నకిలీ బ్యాంక్ అధికారుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.